ఓ జాతీయ ఛానల్, వైజాగ్ గ్యాస్ లీక్ ఉదంతంపై చర్చా కార్యక్రమం నిర్వహిస్తే, ఆ కార్యక్రమానికి ‘సలహాదారు’ దేవులపల్లి అమర్ ఫోన్ ద్వారా అటెండ్ అయ్యారు. ఈ క్రమంలో సదరు నేషనల్ మీడియాకి చెందిన న్యూస్ ఛానల్ కడిగి పారేసింది రాష్ట్ర ప్రభుత్వాన్ని. దాంతో, అట్నుంచి వచ్చే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక చేతులెత్తేశారు.
‘భోపాల్ ఘటన జరిగినప్పుడు బహుశా నువ్వు స్కూల్‌కి వెళుతున్నావేమో.. ఆ ఘటనని నేను కవర్ చేసిన జర్నలిస్టుని..’ అని అమర్ చెప్పగా, నేషనల్ మీడియాకి చెందిన జర్నలిస్ట్, ‘మీ నుంచి పాఠాలు నేర్చుకోవడానికి లేనిక్కడ.. మీ నుంచి ప్రజలకు ఉపయోగపడే సమాధానం చెప్పించడమే నా బాధ్యత’ అని అన్నారు. దాంతో, అమర్ ఇరకాటంలో పడ్డారు. ‘ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.. చూద్దాం, ఆ విచారణ కమిటీ ఏం తేల్చుతుందో’ అని అమర్ నిర్లక్ష్యంగా మాట్లాడారు.
ఇదే అమర్, సీనియర్ జర్నలిస్ట్‌గా, గత ప్రభుత్వాల్ని ఎన్నోసార్లు ప్రశ్నించిన విషయాన్ని ఎలా విస్మరించగలం.? ఎప్పుడైతే ‘సలహాదారు’ అనే పదవి వచ్చిందో, సగటు రాజకీయ నాయకుడిలా ఆయనా మారిపోయారన్నమాట. ఇక, పీవీ రమేష్ అనే మరో సలహాదారు (ఉన్నతాధికారిగా పనిచేశారు కూడా) కూడా ఓ నేషనల్ మీడియా అడిగిన ప్రశ్నలకు చేతులెత్తేశారు. ప్రభుత్వాన్ని సమర్థించలేక చేతులెత్తేస్తున్న సలహాదారులతో ప్రభుత్వానికీ, ప్రజలకూ ఏం లాభమో వైఎస్ జగన్ ప్రభుత్వమే ఆలోచించుకోవాలి.