తెలంగాణలో మే 31 వరకూ లాక్‌డౌన్ కొనసాగుతుందని స్పష్టం చేసిన కేసీఆర్, కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా గ్రీన్ జోన్లలో కార్యకలాపాలకు అనుమతినిస్తున్నామనీ, కంటెయిన్‌మెంట్ జోన్లలో నిబంధనల్ని కరినంగా అమలు చేస్తామని చెప్పారు.
‘బతికుంటే బలుసాకు తినొచ్చని నేనే చెప్పాను. ఇప్పుడు ఆర్థిక పరిస్థితి కూడా బాగుపడాలంటే, కొన్ని వెసులుబాట్లు తప్పవు. ఎవరికి వారు స్వీయ నియంత్రణ విధించుకుంటూనే, అత్యవసరమైన పనులు చక్కబెట్టుకోవాలి’ అని కేసీఆర్ సూచించారు. ‘హెలికాప్టర్ మనీ’ అంటూ గతంలో కేంద్రానికి విజ్ఞప్తి చేసిన కేసీఆర్, ఆ దిశగా కేంద్రం నుంచి సానుకూల స్పందన రాకపోవడం పట్ల పలుమార్లు అసహనం వ్యక్తం చేసిన విషయం విదితమే.
ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీని ‘ఆత్మ నిర్భర భారత్ అభియాన్’ పేరుతో ప్రకటించడం, దాన్ని ఐదు దఫాలుగా ‘వివరిస్తూ’ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మీడియా ముందుకొచ్చి చెప్పడం తెలిసిన సంగతులే. కాగా, రాష్ట్రాలు అప్పు చేసుకునేందుకు పెద్ద మనసుతో అనుమతివ్వాల్సిన కేంద్రం, షరతులు విధించడాన్ని కేసీఆర్ తీవ్రంగా తప్పు పట్టారు.
‘మా ఆలోచనలు మాకున్నాయ్.. మీరు ఇచ్చే ముష్టి మాకు అవసరం లేదు’ అని నిర్మొహమాటంగా కేసీఆర్ తేల్చి చెప్పారు. ‘కేంద్రంతో సఖ్యతగానే వుంటాం.. అలాగని, రాష్ట్ర ప్రయోజనాల్ని దెబ్బతీసేలా కేంద్రం వ్యవహరిస్తే.. ఖచ్చితంగా పోరాడతాం’ అని కేసీఆర్ మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు.
గతంలో, ప్రధాని నరేంద్ర మోడీని దేశంలో ప్రతి ఒక్కరూ గౌరవించాల్సిందేనని నినదించిన కేసీఆర్.. ఇప్పుడు కేంద్రం తీరు పట్ల అసహనం వ్యక్తం చేస్తుండడం గమనార్హం. కేంద్రం మంచి నిర్ణయాలు తీసుకున్నప్పుడు అభినందిస్తాం.. కేంద్రం సరిగ్గా వ్యవహరించకపోతే నిలదీస్తాం.. అని కేసీఆర్ గతంలోనూ చెప్పారు.. ఇప్పుడు అదే మాటకు కట్టుబడి కేంద్రాన్ని నిలదీస్తున్నారు కూడా.
ఇదిలా వుంటే, రేపటి నుంచి తెలంగాణలో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కనున్నాయి. హైద్రాబాద్ నగరంలో మాత్రం సిటీ బస్సులకు అనుమతి లేదు. ఆర్టీసీ బస్సులు కూడా ప్రధాన బస్ స్టేషన్ అయిన ఎంజీబీఎస్‌కి వచ్చే అవకాశం లేదని కేసీఆర్ స్పష్టం చేశారు.