ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

సీఎంను కలిసిన ఎమ్మెల్యేకు కరోనా

కరోనాకు చిన్నా పెద్దా.. రాజు పేద అనే తేడాలేమీ లేవని చెప్పడానికి ఇప్పటికే చాలా ఉదాహరణలున్నాయి. ఏకంగా బ్రిటన్ ప్రధాని, ఆ దేశ యువరాజులకే కరోనా వచ్చింది. హాలీవుడ్లో ఎందరో సెలబ్రెటీలు కరోనా బారిన పడ్డారు. ఇలా ప్రపంచవ్యాప్తంగా మరెంతో మంది ప్రముఖులు కరోనా బాధితులుగా మారారు.

అయినా సరే.. మన దేశ జనాల్లో పెద్దగా భయం కనిపించడం లేదు. జనాల్లో అవగాహన పెంచాల్సిన నాయకులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటం గమనిస్తున్నాం. ఈ మధ్యే అనంతపురంలో ఓ ఎమ్మార్వో కరోనా బారిన పడగా.. ఆయనతో కలిసి ఓ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే క్వారంటైన్‌కు వెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడేమో ఓ ఎమ్మెల్యే కారణంగా ఏకంగా ఓ రాష్ట్ర ముఖ్యమంత్రే కరోనా భయంతో వణకాల్సిన పరిస్థితి తలెత్తింది.

గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్‌కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇమ్రాన్ ఖేద్వాలాకు కరోనా ఉన్నట్లుగా వెల్లడైంది. మంగళవారం సాయంత్రం ఆయనకు పరీక్షలు నిర్వహించగా.. కోవిడ్-19 ఉన్నట్లు వెల్లడైంది. ఐతే ఇమ్రాన్‌ మంగళవారం ఉదయమే గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానిని కలవడం గమనార్హం. అహ్మదాబాద్‌లో కరోనా పరిస్థితిని వివరించడం, సహాయ చర్యలకు సంబంధించి ఆయన ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్‌లతో సమావేశం అయ్యారు.

వాళ్లతో ఇమ్రాన్ ఎంత సన్నిహితంగా ఉన్నాడో.. వాళ్లపై కరోనా ఎఫెక్ట్ ఏమేర ఉందో తెలియదు మరి. ఇమ్రాన్‌ను అయితే వెంటనే ఆసుపత్రికి తరలించి ఐసోలేషన్ వార్డులో పెట్టి చికిత్స అందిస్తున్నారు. అహ్మదాబాద్‌లో కరోనా తీవ్రత కొంచెం ఎక్కువగానే ఉంది. అక్కడ దాదాపు 400 మంది వైరస్ బారిన పడ్డారు. అందులో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో అత్యధిక కరోనా కేసులున్న రాష్ట్రాల్లో గుజరాత్ ఒకటి.

Exit mobile version