ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

కరోనా కష్టాలు.. వైరల్ అవుతున్న మరో వీడియో

కరోనా విజృంభిస్తున్న వేళ.. సుఖంగా ఇంట్లో ఉండమని మొత్తుకుంటున్నా కొందరు జనాలు వినిపించుకోవడం లేదు. ఇంట్లో ఏం తోచట్లేదంటూ బయటికి వచ్చేస్తున్నారు. అంతగా అవసరం లేని వాటి కోసం రోడ్డెక్కుతున్నారు. ఇలాంటి వాళ్లు ఈ సమయంలో ప్రాణాల్ను పణంగా పెట్టి జనాల కోసం కష్టపడుతున్న వారి జీవితాల్ని దగ్గరగా చూస్తే తాము చేస్తున్నది ఎంత తప్పో అర్థమవుతుంది.

వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు ఈ కష్ట కాలంలో పడుతున్న కష్టానికి విలువ కట్టలేం. ముఖ్యంగా వైద్య సిబ్బంది అరకొర సౌకర్యాల మధ్య, ప్రమాదకర పరిస్థితుల్లో బాధితులకు సేవలందిస్తున్నారు. తమ ప్రాణాలకు కూడా ముప్పు ఉన్న సంగతి తెలిసీ తప్పనిసరి పరిస్థితుల్లో పని చేస్తున్నారు. వీళ్ల కష్టం గురించి, దయనీయ పరిస్థితుల గురించి తెలిపే అనేక ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.

తాజాగా కర్ణాటకలోని బెళగావి ప్రాంతానికి చెందిన ఓ నర్సు-ఆమె కూతురికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బెళగావి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో పని చేస్తున్న ఆ నర్సు మూడు వారాలుగా ఆసుపత్రికే పరిమితమైంది. ఆమె సేవలు అక్కడ అత్యవసరం. అంతే కాక కరోనా పేషెంట్లకు చికిత్స అందిస్తుండటం వల్ల ఆమెకు వ్యాధి సోకి ఉంటుందేమో అన్న భయమూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆ నర్సు ఇంటికే వెళ్లట్లేదు. హాస్పిటల్లోనే ఉంటూ నిరంతరం సేవలందిస్తోంది.

ఐతే తల్లిని చాలా రోజులుగా చూడకపోవంతో మూడేళ్ల ఆమె కూతురు అన్నం తిననని మారాం చేస్తోంది. అదేపనిగా ఏడుస్తుండటంతో తండ్రి ఒకసారి తల్లిని చూపిద్దామని హాస్పిటల్ వద్దకు తీసుకొచ్చాడు. కానీ ఆ చిన్నారిని ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఆమె దగ్గరకు తీసుకోలేకపోయింది. ఆ పాప దూరం నుంచి అమ్మను చూస్తూ ఏడుస్తుంటే.. ఆమె కూడా కన్నీళ్లు పెట్టుకుంది. కొన్ని నిమిషాల అలా దూరం నుంచి తల్లిని చూపించి తండ్రి ఇంటికి తీసుకెళ్లిపోయాడు. తర్వాత తల్లి దు:ఖం మరింత పెరిగింది. వైద్య సిబ్బంది కష్టం, త్యాగం ఎలాంటిదో చెప్పేందుకు ఇదో గొప్ప ఉదాహరణ.

Exit mobile version