ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

మెడ్‌టెక్‌ ‘కరోనా’ కిట్లు ఎక్కడిదాకా వచ్చాయ్‌.!

‘దేశం మొత్తానికి కరోనా టెస్టింగ్‌ కిట్స్‌ అందించే స్థాయికి ఆంధ్రప్రదేశ్‌ ఎదిగింది.. ఆర్డర్లు పోటెత్తేస్తున్నాయ్‌.. మన విశాఖ మెడ్‌టెక్‌ జోన్‌లోనే ఇవి తయారవుతున్నాయ్‌..’ అంటూ కొన్నాళ్ళ క్రితం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఘనంగా చెప్పేసుకుంది.

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అయితే, ‘ర్యాపిడ్‌ టెస్టింగ్‌ కిట్లు, వెంటిలేటర్ల కోసం ఇతర రాష్ట్రాల నుంచి అభ్యర్థనలు వస్తున్నాయి. బహిరంగ మార్కెట్‌ కంటే సగం ధరకే అందజేస్తుండడం వల్ల భారీగా ఆర్డర్లు వస్తున్నాయి. ప్రభుత్వం ఎక్కడా దీనిని ప్రచారం కోసం వాడుకోవడంలేదు. కరోనా నియంత్రణ ఉత్పత్తులకు ఏపీ వాణిజ్య హబ్‌ అవుతోంది..’ అంటూ ఓ ట్వీటేసేశారు. ఏప్రిల్‌ 14న విజయసాయిరెడ్డి వేసిన ట్వీట్‌ ఇది. ఈ రోజు ఏప్రిల్‌ 21వ తేదీ.

మెడ్‌టెక్‌ జోన్‌ నుంచి ఎన్ని కరోనా కిట్లు తయారయ్యాయి.? ఎన్ని వెంటిలేటర్లు తయారయ్యాయి.? ఏయే రాష్ట్రాలకు కరోనా కిట్లను మెడ్‌టెక్‌ జోన్‌ అందించింది.? ఎన్ని వెంటిలేటర్లను మెడ్‌టెక్‌ జోన్‌, ఇతర రాష్ట్రాలకు అందించింది.? లాంటి లెక్కల్ని ప్రభుత్వమే బయటపెట్టాల్సి వుంది.

అసలంటూ ఐసీఎంఆర్‌.. మెడ్‌టెక్‌ వెంటిలేటర్లు, ర్యాపిట్‌ టెస్టింగ్‌ కిట్స్‌కీ అనుమతి ఇచ్చిందా.? లేదా.? ఇవన్నీ ప్రస్తుతానికి మిలియన్‌ డాలర్ల ప్రశ్నలే. రాష్ట్రంలో పరిస్థితులు ఇంత గొప్పగా వుంటే, దక్షిణ కొరియా నుంచి అధిక ధర చెల్లించి మరీ టెస్టింగ్‌ కిట్స్‌ని జగన్‌ ప్రభుత్వం కొనుగోలు చేయాల్సి రావడం శోచనీయం కాక మరేమిటి.?

పైగా, ఇప్పుడు ఆ టెస్టింగ్‌ కిట్స్‌ కొనుగోలు వ్యవహారం పెను దుమారానికి కారణమవుతోంది. పబ్లిసిటీ గురించి టీడీపీ మాట్లాడినా, వైసీపీ మాట్లాడినా అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు. వైసీపీ, టీడీపీ.. పేర్లు మాత్రమే వేరు.. మిగతాదంతా సేమ్ టు సేమ్ .. అని జనానికి ఎప్పుడో అర్థమయిపోయింది.

ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగుల విషయమై న్యాయస్థానం మొట్టికాయలేయడంతో సరిపోయిందిగానీ.. లేకపోతే, కరోనా మాస్క్‌లకీ వైసీపీ రంగులే వేయించి, జనానికి పంచడానికి వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఏమాత్రం వెనుకడుగు వేసేది కాదు.

Exit mobile version