ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

పురోహితుల ‘కరోనా’ కష్టాలపై గళం విప్పిన పవన్‌ కళ్యాణ్‌

కరోనా వైరస్‌ – లాక్‌ డౌన్‌ కారణంగా పౌరోహిత్యంపై తీవ్ర ప్రభావమే పడింది. పౌరోహిత్యం మీదనే ఆధారపడ్డ బ్రాహ్మణ కుటుంబాలు గత రెండు మూడు నెలలుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ‘మమ్మల్ని ప్రభుత్వమే ఆదుకోవాలి..’ అంటూ బ్రాహ్మణ సంఘాలు ప్రభుత్వానికి మీడియా సాక్షిగా విజ్ఞప్తి చేస్తున్నా జగన్‌ ప్రభుత్వం ఇప్పటిదాకా వారి సమస్యలపై స్పందించలేదు.

మరోపక్క జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ దృష్టికి తమ పరిస్థితిని బ్రాహ్మణ సంఘాలు తీసుకెళ్ళాయి. ఆంధ్రప్రదేశ్‌ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య, రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రెటరీ తేజోమూర్తుల లక్ష్మినరసింహమూర్తి, రాష్ట్రంలో కరోనా వల్ల పౌరోహిత్యంపై పడిన ప్రభావాన్ని వివరించారనీ, ఆపత్కాలంలో తమను ఆదుకోవాలంటూ ఆయన చేసిన విజ్ఞప్తి సమంజసంగానే వుందనీ, పేద బ్రాహ్మణ కుటుంబాలకు 5 వేల రూపాయల ఆర్థిక సహాయం, నిత్యావసరాల్ని అందించాలని కోరుతున్నారనీ, ప్రభుత్వం ఈ దిశగా స్పందించాలనీ జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.

బ్రాహ్మణ కార్పొరేషన్‌కి కేటాయించిన 100 కోట్లు పక్కదారి పట్టకుండా సక్రమంగా అవసరమైన పేద బ్రాహ్మణ కుటుంబాలకీ, బ్రాహ్మణ విద్యార్థులకీ ప్రయోజనం చేకూరేలా వినియోగించాలనీ జనసేన అధినేత డిమాండ్‌ చేశారు.

ఇదిలా వుంటే, జనసేన పార్టీకి చెందిన పలువురు నేతలు, జనసైనికులు తమకు తోచిన మేర గ్రామ స్థాయిలో పేద బ్రాహ్మణులకు నిత్యావసర వస్తువుల్ని అందజేస్తున్నారు. జనసేనాని పిలుపు మేరకు తమకు శక్తి మేర పేద కుటుంబాల్ని ఆదుకుంటున్నట్లు జనసైనికులు చెబుతున్నారు.

జనసైనికుల సేవా కార్యక్రమాల్ని ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియా వేదికగా జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ప్రస్తావిస్తున్న విషయం విదితమే.

Exit mobile version