ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

ఏపీకి లక్ష కరోనా టెస్టింగ్ కిట్లు..

కరోనా వైరస్ విషయంలో ఆంధ్రప్రదేశ్ సర్కారు మొదట్లో ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించిందో తెలిసిందే. స్వయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డే ఈ వైరస్ గురించి చాలా తేలిగ్గా మాట్లాడారు. వైరస్ ప్రమాదాన్ని పట్టించుకోకుండా రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా నిర్వహించాలని అనుకున్నారు. తర్వాత పరిణామాలు ఎలా మారిపోయాయో తెలిసిందే.

ఇప్పుడు అక్కడ కరోనా కేసుల సంక్య 600కు చేరువ అవుతోంది. ఐతే మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో కరోనా టెస్టులు చాలా తక్కువగా జరుగుతున్నాయని.. లేదంటే కేసుల సంఖ్య ఇంకా ఎక్కువ ఉండేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి సమయంలో ఏపీ సర్కారు కరోనా టెస్టులు పెంచే దిశగా గొప్ప ముందడుగు వేసింది. ఒకేసారి ఏకంగా లక్ష కరోనా టెస్టింగ్ కిట్లు తెప్పించింది.

దక్షిణ కొరియా నుంచి ప్రత్యేక విమానంలో ఆంధ్రాకు లక్ష కరోనా టెస్టింగ్ కిట్లు వచ్చినట్లు ఏపీ ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇవి ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లు కావడం విశేషం. పరీక్ష నిర్వహించిన పది నిమిషాల్లోనే ఫలితం వచ్చేస్తుంది. ఈ కిట్లను అన్ని జిల్లాలకు వెంటనే పంపించి విస్తృతంగా పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం చూస్తోంది. ఈ నేపథ్యంలో కేసుల సంఖ్య అమాంతం పెరిగినా పెరగొచ్చు.

ఇప్పటిదాకా ఆంధ్రాలో 20 వేల కరోనా టెస్టులు జరిగినట్లు ప్రభుత్వం చెబుతోంది. గత ఐదు రోజుల్లోనే 13 వేల పరీక్షలు జరిగాయంటున్నారు. ఇదిలా ఉండగా.. పది నిమిషాల్లో పరీక్షలు నిర్వహించే ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్ సరిగా పని చేయట్లేదని.. వాటిలో అక్యురసీ ఉండట్లేదని అంతర్జాతీయ స్థాయిలో వార్తలు వస్తున్నాయి. కొరియాలోనే వీటి గురించి నెగెటివ్ వార్తలు వచ్చాయి. కొరియన్ డాక్టర్లే వీటి వాడకాన్ని వ్యతిరేకిస్తూ వ్యాఖ్యలు చేసిన వీడియోలు నెట్లో దర్శనమిస్తుండటం గమనార్హం.

Exit mobile version