అభివృద్ధి సంగతి పక్కన పెడితే, కరోనా వైరస్ కారణంగా చోటు చేసుకుంటున్న మరణాల్లో తెలంగాణని మించిపోయింది ఆంధ్రప్రదేశ్. నిజానికి, కరోనా పాజిటివ్ కేసుల పరంగా చూస్తే ప్రస్తుతానికి (ఏప్రిల్ 24 లెక్కల ప్రకారం) ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణ ముందంజలో వుంది. కానీ, మరణాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణను మించిపోవడం గమనార్హం. ఎందుకిలా.? ఈ ప్రశ్నకి వైసీపీ సమాధానమేంటో తెలుసా.? చంద్రబాబు 3 లక్షల కోట్లు అప్పు చేసి పోయారని. దానికీ, దీనికీ లింకేంటి.? అంటే, అదే మరి నీఛమైన రాజకీయమంటే.
చంద్రబాబు హయాంలో వైద్య రంగం నిర్లక్ష్యానికి గురయ్యిందన్నది వైసీపీ ఆరోపణ. మరి, ఏడాది పాలనలో వైసీపీ ఏం చేసిందట.? దీనికి మాత్రం వైసీపీ దగ్గర సమాధానం దొరకదు. ఒకరు తక్కువా కాదు.. ఇంకొకరు ఎక్కువా కాదు.. చంద్రబాబుకి ధీటుగా వైఎస్ జగన్ పబ్లిసిటీ స్టంట్లు చేస్తున్నారు అధికార పీఠమ్మీద కూర్చుని. ప్రభుత్వ కార్యాలకు పార్టీ రంగులేసుకున్న ఖర్చుతో, హైద్రాబాద్‌ని తలదన్నే ఆసుపత్రుల్ని నిర్మించుకోవచ్చు. కానీ, పార్టీ రంగుల మీదున్న శ్రద్ధ ప్రజారోగ్యం మీద వైసీపీకి వుంటుందని ఎలా అనుకోగలం.?
పత్రికలు, ఛానళ్ళలో తమ ప్రభుత్వం తరఫున ప్రకటనల కోసం ఇస్తున్న ఖర్చుతో వైద్య రంగానికి మేలు చేయొచ్చన్న కనీస విజ్ఞత వైఎస్ జగన్ సర్కార్‌కి లేకపోవడం శోచనీయం. చంద్రబాబు ఏం చేశారో, వైఎస్ జగన్ కూడా అదే చేస్తున్నారు. ఇదే రాష్ట్రానికి శాపంగా మారుతోంది. కరోనా వ్యాప్తిని నిరోధించడంలో ఆంధ్రప్రదేశ్ దూసుకుపోతోందని వైఎస్ జగన్ ప్రభుత్వం చెబుతోందిగానీ.. వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా వున్నాయి. కరోనా పాజిటివ్ కేసుల్లోనూ తెలంగాణను ఆంధ్రప్రదేశ్ దాటేయనుంది. ఇదీ ఆంధ్రప్రదేశ్ దుస్థితి.