ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

కరోనా కట్టడి: ఆంధ్రప్రదేశ్‌లో అదిరిపోయిందంతే.!

‘కరోనా కట్టడిలో ఇతర రాష్ట్రాల కంటే ముందున్నాం.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాల పట్ల రాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.. విపక్షాలే అనవసర రాద్ధాంతం చేస్తున్నాయి..’ అంటూ అధికార పార్టీకి చెందిన ముఖ్య నేతలు, ప్రభుత్వ పెద్దలు.. మరీ ముఖ్యంగా మంత్రులు మీడియా ముందుకొచ్చి ప్రకటనలు గుప్పించేస్తున్నారు.. విపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.

మరోపక్క ‘ప్రెస్ మీట్లు పెట్టి హంగామా చేయడం కాదు.. క్షేత్ర స్థాయిలో పరిస్థితుల్ని తెలుసుకోండి..’ అంటూ బాధితులు ఆసుపత్రుల వద్ద సౌకర్యాలు లేక కన్నీరు మున్నీరవుతూ, ప్రభుత్వ పెద్దలపై శాపనార్థాలు పెట్టే పరిస్థితి కనిపిస్తోంది. వైఎస్ జగన్ ప్రభుత్వం ఎంత గొప్పగా ‘కరోనా వైరస్’ని కట్టడి చేసేస్తోందో తెలుసా.? రోజువారీ కేసులు ఏకంగా ఇరవై వేల పైబడి ప్రతిరోజూ నమోదయ్యేంతలా. ఈ పరిస్థితి ఎప్పటికి అదుపులోకి వస్తుందో తెలియని పరిస్థితి. ఇంకో వైపు వ్యాక్సినేషన్ విషయంలోనూ తీవ్ర గందరగోళం కనిపిస్తోంది.

అవసరమైనన్ని రెమిడిసివిర్ ఇంజెక్షన్లను అందుబాటులో వుంచుతున్నామని ప్రభుత్వం చెబుతోంది.. కానీ, కరోనా బాధితులేమో.. రెమిడిసివిర్ దొరక్క నానా పాట్లూ పడుతున్నారు.. బ్లాక్ మార్కెట్టులో మాత్రం రెమిడిసివిర్ ఇంజెక్షన్ 30 వేల నుంచి 50 వేలు.. ఆ పైన ధర చెల్లిస్తే, తేలిగ్గానే దొరికేస్తోంది. అంటే, రెమిడిసివిర్ ఇంజెక్షన్లు బ్లాక్ మార్కెట్టులో లభ్యమవుతుండడం గురించే ప్రభుత్వం చెబుతోందా.? అన్నది కరోనా బాధితుల బంధువుల ఆవేదన. కొత్త కేసులతోపాటు, కొత్తగా చోటు చేసుకుంటున్న మరణాలు కూడా ఆందోళనకరంగానే వుంటున్నాయి.

అధికారిక లెక్కల ప్రకారమే మరణాల సంఖ్య 10కి అటూ ఇటూగా వుంటోంటే.. అనధికారికంగా ఈ లెక్క ఎంత వుంటుందోనన్న భయం రాష్ట్ర ప్రజల్లో కలగడం సహజమే. ఇదిలా వుంటే, కొన్ని జిల్లాల్లో ఓ రోజు అత్యధికంగా కేసులు నమోదైతే, మరో రోజు అదే జిల్లాలో అనూహ్యంగాకేసుల సంఖ్య తగ్గిపోతోంది.. అంటే, ఇక్కడా టెస్టుల్లో లోపం వుందని అనుకోవాలేమో. ఇలా ఇన్ని వైఫల్యాల నడుమ.. కరోనా కట్టడి.. అంటూ ప్రభుత్వ పెద్దలు పబ్లిసిటీ స్టంట్లు చేస్తోంటే నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితి ప్రజలది.

Exit mobile version