ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

రెండోసారి వైరస్.. ప్రమాదకరం కాదా?

ప్రపంచానికి పెను సవాల్ గా పరిణమించిన కరోనా విజృంభణ ఏ మాత్రం తగ్గలేదు. దీని ఉనికి మొదలై ఇప్పటికి ఆరు నెలలు గడిచినా.. ఈ మహమ్మారిని అదుపు చేయడానికి మానవాళి ఇంకా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఈ వైరస్ ను నిరోధించే ఔషధం లేకపోయినా.. అందుబాటులో ఉన్న మందులు, ఇతరత్రా చర్యల ద్వారా ప్రపంచవ్యాప్తంగా పలువురు బాగానే కోలుకున్నారు. ఇలా కోలుకున్నవారికి కూడా మరోసారి ఈ వైరస్ సోకే ప్రమాదం ఉంది.

అయితే, అలా రెండోసారి కరోనా వచ్చినా అంత ప్రమాదకరం కాదని తాజాగా జరిగిన అధ్యయనంలో వెల్లడైంది. అప్పటికే వారు కరోనా నుంచి కోలుకుని ఉన్నందున, వారి శరీరంలో యాంటీ బాడీలు పెద్ద సంఖ్యలో ఉంటాయని, దాంతో ఆ వైరస్ ను అవి అడ్డుకుంటాయని పరిశోధకులు గుర్తించారు. అంతేకాకుండా ఇలా రెండోసారి వైరస్ వచ్చినవారి నుంచి ఇతరులకు వ్యాపించే ప్రమాదం కూడా తక్కువేనని కనుగొన్నారు.

దక్షిణ కొరియాకు చెందిన పరిశోధకులు కరోనా వచ్చి కోలుకున్న 400 మందిపై పరిశోధన జరిపారు. వీరిలో దాదాపు 300 మంది తిరిగి కరోనాబారిన పడినవారున్నారు. వీరితో సన్నిహితంగా ఉన్న దాదాపు 800 మందిని పరిశీలించగా.. వారెవరికీ కూడా కరోనా వ్యాప్తి కాలేదని గుర్తించారు. పైగా రెండోసారి కరోనా వచ్చినవారిలో చాలామందికి వైరస్ లక్షణాలు కూడా కనిపించలేదు.

దీంతో ఇలా రెండోసారి కరోనా సోకినవారు వైరస్ వ్యాప్తి కారకాలుగా ఉండరని తెలుసుకున్నారు. వైరస్ తో పోరాడే యాంటీ బాడీల సంఖ్య వారి శరీరంలో సమృద్ధిగా ఉండటం వల్లే దీని ప్రభావం అంతగా ఉండటంలేదని.. అందువల్లే వారిలో కరోనా లక్షణాలు కూడా కనిపించడంలేదని పరిశోధకులు వివరించారు. అయితే, ఇలా రెండోసారి వైరస్ సోకిన వ్యక్తులకు ఎలాంటి ప్రమాదం లేదని స్పష్టంగానే తెలిసినా.. ఈ విషయంలో మరిన్ని పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందని వివరించారు.

Exit mobile version