ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

ఆ కామెంట్ లపై రవితేజ డైరెక్టర్ ఏమన్నాడు?


మాస్ మహారాజా రవితేజ నటించిన మాసీవ్ ఎంటర్ టైనర్ `రామారావు ఆన్ డ్యూటీ`. శరత్ మండవ దర్శకత్వం వహించాడు. జూలై 29న అంటే మరో రెండు రోజుల్లో ఈ మూవీ థియేటర్లలోకి రాబోతోంది. ఈ నేపథ్యంలో దర్శకుడు శరత్ మండవ ట్విట్టర్ రివ్యూలపై చేసిన ఘాటు వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తాయి.నెట్టింట ఆయనపై పెద్ద దుమారమే రేగింది. యుఎస్ ప్రీమియర్స్ ముగియకముందే ట్విట్టర్ లో స్క్రీన్ షాట్స్ పోస్ట్ చేస్తూ కామెంట్ లు చేసేవారిపై దర్శకుడు శరత్ మండవ ఇటీవల మండిపడ్డారు.

ట్విట్టర్ లో రివ్యూలు చూడటం మానేస్తే అంతా బాగుపడతారని సీరియస్ అయ్యారు. అయితే దీనిపై చాలా మంది కౌంటర్ లు వేశారు. రివ్యూలని విమర్శిస్తావేంటీ? అంటూ ఘాటుగానే స్పందించారు. అయితే తన వ్యాఖ్యల వెనకున్న ఉద్దేశ్యాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చారు. రివ్యూలు అన్నా రివ్యూలు రాసేవారన్నా తనకు ఎలాంటి వ్యతిరేకత లేదని స్పష్టం చేశారు. రివ్యూల వల్లే తాను చాలా నేర్చుకున్నానని చెప్పుకొచ్చారు.

తెలుగులో చాలా మంది మంచి రివ్యూలు రాసేవాళ్లున్నారు. నేను వాళ్లని విమర్శించలేదంటూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. `సినిమా అనేది వందల మంది సమిష్టి కృషి. అంత మంది పడిన కష్టానికి ఫలితం వుండాలని ఆశపడతారు కదా!. అలాంటప్పుడు సినిమాను పూర్తిగా చూసి అర్థం చేసుకుని దాని గురించి సమీక్ష రాయడంలో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. రివ్యూలు వుండాలి. రివ్యూలు చదివే నేను చాలా నేర్చుకున్నాను. రివ్యూలు విశ్లేషణాత్మకంగా నిర్మాణాత్మకంగా వుంటే మంచిది.

కానీ అలా కాకుండా సినిమా షో చూస్తుండగానే పార్ట్ లు పార్ట్ లుగా స్క్రీన్ షాట్ లు ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ రివ్యూలు చెప్పేస్తున్నారు. అది నాకు నచ్చలేదు. దీని వల్ల సినిమా చూడాలనుకునే వాళ్ల ఆసక్తి దెబ్బతింటుంది. ఈ పద్దతి సరైంది కాదు. సినిమా పూర్తిగా ప్రేక్షకుడికి అర్థం అయ్యేలోపే దానిపై ఎందుకింత నెగటివ్ ప్రచారం అనేదే నా బాధ. ఈ పద్దతిలో మార్పులు రావాలనే స్పందించాను`అని ట్విట్టర్ రివ్యూలపై వివరణ ఇచ్చారు శరత్ మండవ.

మాస్ మహారాజా నటించిన `రామారావు ఆన్ డ్యూటి` ఓ యదార్ధ సంఘటన ఆధారంగా తెరకెక్కింది. ఈ తరహా కథని రవితేజ చేయడం ఇదే తొలిసారి అని చెబుతున్నారు. కొన్నేళ్ల విరామం తరువాత వేణు తొట్టెంపూడి రీఎంట్రీ ఇస్తున్న ఈ మూవీ శుక్రవారం ఎలాంటి ఫలితాన్ని అందించనుందో తెలియాలంటే మరి కొన్ని గంటలు వేచి చూడాల్సిందే.

Exit mobile version