ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

డైరెక్టర్ శంకర్ ఎందుకు ఇలా చేస్తున్నాడు?

స్టార్ డైరెక్టర్ శంకర్ ఏ సినిమా చేసినా అది భారీ స్థాయిలోనే వుంటుంది. టెక్నికల్ గా హై స్టాండర్డ్స్ లో వుండేలా ప్లాన్ చేసుకుంటున్న ఆయన కాంబినేషన్ ల పరంగానూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారుతున్నారు. కెరీర్ ప్రారంభం నుంచి ఏదో ఒక సామాజిక అంశాన్ని తీసుకుని దాన్ని కమర్షియల్ పంథాలో తెరపై ఆవిష్కరిస్తూ భారీ విజయాల్ని సొంతం చేసుకుంటున్నారు. ఆయనతో కనీసం కెరీర్ లో ఒక్క సినిమా అయినా సరే చేయాలని టాలీవుడ్ టు బాలీవుడ్ వరకున్న స్టార్ హీరోలు ఎదురుచూస్తున్నారు.

ఇండియన్ స్పీల్ బర్గ్ గా పేరు తెచ్చకున్న శంకర్ పై ఓ అపవాదు వైరల్ గా వినిపిస్తోంది. క్రేజీ స్టార్ లని విలన్లుగా మారుస్తూ వారి కెరీర్ కి చరమగీతం పాడుతున్నాడన్నది శంకర్ పై తాజాగా వినిపిస్తున్న కామెంట్. ప్రస్తుతం ఇది పలు ఇండస్ట్రీల్లో హాట్ టాపిక్ గా మారింది. స్టోరీ డిమాండ్ మేరకు అంటూ ఒకప్పటి హీరోలతో పాటు ప్రస్తుతం క్రేజ్ లో వున్న హీరోలని కూడా శంకర్ విలన్ లుగా మారుస్తూ వారి కెరీర్ తో ఆడుకుంటున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మలయాళంలో అప్పటి వరకు క్రేజీ హీరోగా వున్న వినీత్ ని `జెంటిల్ మెన్` సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మార్చారు. యాక్షన్ కింగ్ అర్జున్ హీరోగా నటించిన ఈ చిత్రం సంచలన విజయాన్ని సాధించిన దర్శకుడిగా శంకర్ చేసిన తొలి ప్రయత్నం ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. అయితే ఈ ఎఫెక్ట్ నుంచి బయటపడటానికి వినీత్ కు టైమ్ పట్టింది. ఆ తరువాత సూపర్ స్టార్ రజనీకాంత్ తో చేసిన `శివాజీ` చిత్రంతో ఒకనాటి హీరో సుమన్ ని అనూహ్యంగా విలన్ గా మార్చి సంచలనం సృష్టించారు.

అయితే ఆ తరువాత సుమన్ కు ఆ స్థాయిలో అవకాశాలు రాలేదు. పవర్ ఫుల్ విలన్ గా శంకర్ పరిచయం చేసినా సుమన్ మాత్రం మళ్లీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలనే నమ్ముకోవాల్సి వచ్చింది. ఇక 2015లో శంకర్ ప్రయోగాత్మకంగా చియాన్ విక్రమ్ తో చేసిన `ఐ` సంచలనం అవుతుందని అంతా ఊహించారు. ఈ మూవీతో అనూహ్యంగా మలయాళ స్టార్ సురేష్ గోపీని కన్నింగ్ విలన్ గా మార్చి ప్రపంచానికి వికృతంగా పరిచయం చేశారు శంకర్. ఆయనని నమ్మి ఈ మూవీ చేసిన సురేష్ గోపి ఆ తరువాత తన క్రేజ్ ని కోల్పోయి దాదాపు ఐదేళ్ల విరామం తరువాత మళ్లీ సినిమాల్లో నటించాల్సి వచ్చింది. 2015 తరువాత మరో సినిమా చేయని సురేష్ గోపి 2020 లో మళ్లీ సినిమాల్లో నటించడం మొదలుపెట్టారు.

2018లో శంకర్ చేసిన గ్రాఫికల్ వండర్ `2.O`. 2010 లో చేసిన `రోబో` చిత్రానికి సీక్వెల్ గా చేసిన ఈ మూవీతో పక్షిరాజుగా విలన్ పాత్రలో బాలీవుడ్ కిలాడీ అక్షయ్ కుమార్ ని పరిచయం చేశారు. 500 కోట్ల భారీ బడ్జెట్ తో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయింది. అక్షయ్ కుమార్ ఈ మూవీ సమయంలో జోలీ ఎల్ ఎల్ బీ టాయ్ లెట్ ఏక్ ప్రేమ్ కథ ప్యాడ్ మ్యాన్ గోల్డ్ వంటి వరుస హిట్ చిత్రాలని అందించారు. అయినా సరే అక్షయ్ కుమార్ క్రేజ్ ఈ మూవీని కాపాడలేకపోయింది.

బాలీవుడ్ లో స్టార్ గా ఓ వెలుగు వెలుగుతున్న అక్షయ్ కుమార్ ని విలన్ ని చేసిన శంకర్ అతనికి సక్సెస్ ని మాత్రం అందించలేకపోయాడు. ఇదే కోవలో రామ్ చరణ్ తో చేస్తున్న RC 15 సినిమా కోసం మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ని విలన్ పాత్ర కోసం అడిగి శంకర్ భంగపడిన విషయం తెలిసిందే. ఇలా ఒక భాషలో టాప్ హీరోలుగా మాంచి ఫామ్ లో వున్న వారిని శంకర్ తన కోసం విలన్ లుగా మారుస్తూ వారి కెరీర్ లలో ఆడుకోవడం ఏం బాగాలేదని డైరెక్టర్ శంకర్ ఎందుకు ఇలా చేస్తున్నాడు? అని సినీ లవర్స్ కామెంట్ లు చేస్తున్నారు. మోహన్ లాల్ కాదన్నాడని మరే స్టార్ ని విలన్ గా శంకర్ రంగంలోకి దించేస్తాడో చూడాలి.

Exit mobile version