ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

భూ కబ్జా ఆరోపణలు: మంత్రి ఈటెలపై వేటుకి రంగం సిద్ధం.?

తెలంగాణ రాజకీయాల్లో అనూహ్యమైన కుదుపు. మంత్రి ఈటెల రాజేందర్ భూ కబ్జాలకు పాల్పడ్డారంటూ తొలుత ‘పింక్ మీడియా’లో కథనాలు షురూ అయ్యాయి. ఆ తర్వాత పలు మీడియా సంస్థలు ఈ వ్యవహారానికి విపరీతమైన ప్రాధాన్యతనిచ్చాయి. దాదాపు 100 ఎకరాల అసైన్డ్ భూముల్ని ఈటెల రాజేందర్ లాక్కున్నారన్నది ప్రధాన ఆరోపణ. ఈ మేరకు బాధితులు, నేరుగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ఫిర్యాదు చేయడం గమనార్హం. ఫిర్యాదుపై స్పందించిన సీఎం కేసీఆర్, నిజాలు నిగ్గు తేల్చాలంటూ చీఫ్ సెక్రెటరీ సోమేష్ కుమార్ ని ఆదేశించారు.

మరోపక్క, ఈటెల రాజేందర్, ఆ భూముల్ని రెగ్యలరైజ్ చేయాలంటూ తమ మీద ఒత్తిడి తెచ్చారంటూ పలువురు అదికారులు ఆరోపించడం గమనార్హం. ఈటెల రాజేందర్ సతీమణి పేరుతో ఓ హేచరీస్ సంస్థను నిర్వహిస్తున్నారు ఈటెల రాజేందర్. ఆ సంస్థ తరఫున భూముల్ని లాక్కున్నారన్నది ‘పింక్ మీడియా’ కథనాల సారాంశం.

ఇదిలా వుంటే, గత కొంతకాలంగా తెలంగాణ రాష్ట్ర సమితి అంతర్గత రాజకీయాల్లో ఇమడలేకపోతున్నారు ఈటెల. ‘మేం గులాబీ పార్టీకి ఓనర్లం.. కిరాయిదార్లం కాదు..’ అంటూ ఆ మధ్య ఈటెల చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. అంతే కాదు, ‘మాట్లాడేవారి గొంతు నొక్కాలనుకోవడం సబబు కాదు..’ అని మరో సందర్భంలో వ్యాఖ్యానించారు. ఇవన్నీ పార్టీ ప్రతిష్టనీ, ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసే చర్యలంటూ గులాబీ పార్టీకి చెందిన కొందరు ముఖ్య నేతలు, అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ఫిర్యాదు కూడా చేసినట్లు తెలుస్తోంది.

ఈటెల, మొదటి నుంచీ తన వెంట వుండడం, ఉద్యమ నాయకుడు కావడంతో కేసీఆర్, సరైన సమయం కోసం వేచి చూశారు. సరిగ్గా సమయం చూసి, ఈటెలను రాజకీయంగా దెబ్బ కొట్టేందుకు స్వయంగా కేసీఆర్ ఈ భూ కబ్జా అస్త్రాన్ని ప్రయోగించారనే వాదనలు వినిపిస్తున్నాయి.

ఇదిలా వుంటే, తనపై వేటు పడుతుందని గ్రహించిన ఈటెల, రాజీనామాస్త్రాన్ని ప్రయోగించడానికి సన్నిహితుల నుంచి అభిప్రాయాల్ని తెలుసుకుంటున్నారట. మంత్రి పదవికి రాజీనామా చేయడంతోపాటు, గులాబీ పార్టీకీ అలాగే ఎమ్మెల్యే పదవికీ ఈటెల రాజీనామా చేస్తారనే ప్రచారం జరుగుతోంది.

Exit mobile version