ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

ఈటల పార్టీ మార్పు ముహూర్తం ఖరారు

మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన ఈటల రాజేందర్ పార్టీ మార్పునకు అంతా సిద్దమైంది. బీజేపీలో చేరడానికి ఏర్పాట్లన్నీ పూర్తిచేసుకున్నట్టు సమాచారం. ఈనెల 31వ తేదీని ముహూర్తంగా నిర్ణయించుకున్నట్టు తెలిసింది. భూకబ్జా ఆరోపణలు రావడంతో సీఎం కేసీఆర్.. ఆయన్ను కేబినెట్ నుంచి తప్పించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి పలు పార్టీల నేతలు, ప్రజాసంఘాల నాయకులు ఈటలతో భేటీ అయ్యారు. అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ నేతలు కూడా ఈటలను తమ పార్టీల్లోకి ఆహ్వానించారు. ఈ క్రమంలో తన అనుచరులు, శ్రేయోభిలాషులతో వరుసగా సమావేశమైన ఈటల.. తన రాజకీయ భవితవ్యంపై ఎలా ముందుకెళ్లాలనే విషయంపై వారితో చర్చించారు. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ కంటే బీజేపీలో చేరడమే మేలని పలువురు ఆయనకు సూచనలు చేసినట్టు సమాచారం. మరికొందరు కొత్త పార్టీ పెడితే బావుంటుందని సలహా ఇచ్చారు.

తెలంగాణ జనసమితి అధినేత ప్రొఫెసర్ కోదండరాం గురువారం ఈటలను కలిసి బీజేపీలో చేరడానికి తొందరపడొద్దని.. కేసీఆర్ కు ప్రత్యామ్నాయంగా విశాల రాజకీయ వేదిక ఏర్పాటు చేద్దామని ప్రతిపాదించారు. అయితే, ఈటల మాత్రం బీజేపీలో చేరడానికే మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది. రాష్ట్రంలో అధికార పార్టీని ఎదుర్కోవాలంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అండ అవసరమని ఆయన భావిస్తున్నట్టు చెబుతున్నారు. మరోవైపు బీజేపీ నేతలు కూడా ఈటలను చేర్చుకోవడానికి సుముఖంగా ఉన్నారు. దీంతో ఈనెల 31న లేదా జూన్ ఒకటి, రెండో తేదీల్లో రాజేందర్ కాషాయ కండువా కప్పుకోనున్నారని చెబుతున్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరి, ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారని అంటున్నారు.

Exit mobile version