ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

ఇక ఈటల కుమారుడి వంతు..?

భూ కబ్జా ఆరోపణలపై మంత్రి పదవి కోల్పోయి అధికార పార్టీకి టార్గెట్ గా మారిన ఈటల రాజేందర్ వ్యవహారంలో మరిన్ని కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఈటల కుమారుడిపైనా సీఎం కేసీఆర్ కు ఫిర్యాదు అందింది. ఈటల కుమారుడు నితిన్ రెడ్డి తన భూమిని కబ్జా చేశారంటూ మేడ్చల్ మండలం రావల్ కోల్ వాసి మహేశ్ ఫిర్యాదు చేశారు. తనకు న్యాయం చేయాలని సీఎంను కోరారు. దీనిపై సీఎం వెంటనే స్పందించారు. తక్షణమే ఈ వ్యవహారంపై విచారణ చేయాలని సీఎస్ సోమేశ్ కుమార్, ఏసీబీ విజిలెన్స్ ను ఆదేశించారు. సమగ్ర నివేదిక జరిపి నివేదిక ఇవ్వాలని సూచించారు. ఇప్పటికే భూకబ్జా ఆరోపణలతో సతమతమవుతున్న ఈటలకు ఇది మరో షాక్ గా మారింది.

ఇప్పటికే మెదక్ జిల్లా అచ్చంపేట, హకీంపేటల్లో అసైన్డ్ భూములను ఆక్రమించుకున్నారనే ఆరోపణలపై సీఎం కేసీఆర్ ఆయన్ను మంత్రివర్గం నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. ఓవైపు కేసులు, విచారణలతో ఇబ్బందులు పడుతున్న ఈటలను రాజకీయంగా కూడా దెబ్బతీసే వ్యూహంతో అధికార పార్టీ సాగుతోంది. ఈటల నియోజకవర్గంలో టీఆర్ఎస్ క్యాడర్ ఈటల వైపు వెళ్లకుండా చూసే బాధ్యతను మంత్రి హరీశ్ రావుకు అప్పగించారు. దీంతో ఆయన ఇప్పటికే రంగంలోకి దిగిపోయి చర్యలు ప్రారంభించారు. ఇదే సమయంతో తన కుమారుడిపైనా భూకబ్జా ఆరోపణలు రావడంతో ఈటల ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

Exit mobile version