ఈ నేపథ్యం నుంచే కౌశల్ ఆర్మీ పుట్టుకొచ్చింది. అత్యంత వివాదాస్పదమైన సీజన్ ఏదైనా ఉందా అని ప్రశ్నించుకుంటే…నాని హోస్ట్‌గా వ్యవహరించిన రెండో సీజనే అని చెప్పుకోవాలి. ఆ సీజన్‌లో ప్రముఖ మానవతా వాది బాబు గోగినేని, సింగర్ గీతా మాధురి, టీవీ9 విజయవాడ రిపోర్టర్ దీప్తి, తనీష్, యాంకర్ శ్యామల తదితరులు పాల్గొన్నారు. చివరికి విజేతగా కౌశల్ నిలిచారు. అయితే కౌశల్ పేరుతో ఆర్మీ గ్రూపులను ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ఆన్‌లైన్ ఓటింగ్ చేపట్టారనే విషయం తెలిసిందే. ఇందుకోసం భారీగా డబ్బు కూడా వెచ్చించినట్టు అనేక ఆరోపణలు కూడా వచ్చాయి.
ఇక ప్రస్తుతానికి వస్తే బిగ్‌బాస్ సీజన్-4 స్టార్ట్ అయింది. మై విలేజ్ షో యూట్యూబ్ చానల్ ద్వారా సోషల్ మీడియాలో పాపులర్ అయిన గంగవ్వ అత్యంత ప్రాముఖ్యత గల కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి ఎంటర్ అయ్యారు. మొదటి నుంచి ఈమె పేరు వినపడుతూ ఉంది. గంగవ్వకు నెటిజన్స్ నుంచి భారీ మద్దతు లభిస్తోంది. ఇందుకు ఆమె తెలంగాణ యాస, పల్లెటూరి అమాయకత్వం, అన్నిటికి మించి వేషధారణ బుల్లితెర ప్రేక్షకుల్ని, నెటిజన్లను ఫిదా చేస్తోంది.
ఈ నేపథ్యంలో గంగవ్వకు మద్దతుగా #Gangavva #BiggBossTelugu4 హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండింగ్ చేస్తూ గంగవ్వ ఆర్మీ సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేస్తోంది.
బిగ్ బాస్ కాన్సెప్ట్ నచ్చని వాళ్లు సైతం గంగవ్వ కోసమైనా చూడాలని ఆసక్తి చూపుతున్నారు. అంతేకాదు, గంగవ్వను విజేతగా నిలపాలని తహతహలాడుతున్నారు. ఇందుకోసం ఆమెకు మద్దతుగా క్యాంపెయిన్ నిర్వహించేందుకు నెటిజన్లు ముందుకొస్తున్నారు. గంగవ్వపై ఇదే రకమైన మద్దతు చివరి వరకూ కొనసాగితే మాత్రం…ఆమె అద్భుతాలు సృష్టించే అవకాశం లేకపోలేదు.