నిజానికి తెలుగులో ట్రాజెడిక్ ఎండింగ్ అసలు హిట్ ఫార్ములా కాదు. తెలుగు ప్రేక్షకులకు హ్యాపీ ఎండింగ్ ఉండాల్సిందే. కానీ.. గీతాంజలి క్లైమాక్స్ ట్రాజెడీ కాకపోయినా.. చివరి అంచుల వరకూ వెళ్లి ఆగిపోతుంది. ఇదంతా దర్శకుడు మణిరత్నం మాయాజాలం. ప్రేక్షకుల్ని కట్టిపడేసిన కథ, కథనం ప్రేక్షకుల్ని సినిమాలో లీనమయ్యేలా చేసేశాయి. నాగార్జున, గిరిజా షెట్టర్ ల మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా పండింది. ఇద్దరు ప్రేమికుల్ని చూస్తున్న ఫీలింగే కానీ.. అదొక సినిమా అనే భావనే స్ఫురణకు రానంతగా మెప్పించారు. స్లో నెరేషన్ అయినా.. ప్రేక్షకులకు తన మార్క్ టేకింగ్ తో మత్తెక్కించారు మణిరత్నం. ప్రేమకు మరణం అడ్డురాదు.., రేపు కాదు.. జీవితంలో ఈరోజే ముఖ్యం అనే కాన్సెప్టే ఒక అద్భుతం.
ఈ సినిమాకు ప్రేక్షకులు బాగా కనెక్టయ్యారు. మణిరత్నం తెలుగులో డైరక్ట్ గా తెరకెక్కించిన ఏకైక సినిమా ఇది. పీసీ శ్రీమ్ చాయాగ్రహణం, ఇళయరాజా సంగీతం, లెనిన్, విజయన్ ఎడిటింగ్.. సినిమాకు మేజర్ ఎస్సెట్స్. భాగ్యలక్ష్మి ఎంటర్ ప్రైజెస్ బ్యానర్ పై సీఎల్. నరసారెడ్డి ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాలో నాగార్జున హెయిర్ స్టయిల్ అప్పట్లో ట్రెండ్ సెట్టర్ అయి అలా ఉండిపోయింది. హీరోయిన్ గిరిజకు చేసిన ఏకైక సినిమా ఇదే. యువతను కట్టిపడేసిన ఈ సినిమా అద్భుత విజయం సాధించింది. ప్రేమకథల్లో ఈ సినిమా టాలీవుడ్ లో ఒక క్లాసిక్ గా నిలిచిపోయిందనడంలో అతిశయోక్తి లేదు.