సాధారణంగా లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీభత్సంగా ఈ ప్రలోభాల పర్వం నడుస్తుంటుంది. పంచాయితీ ఎన్నికల్లోనూ ఈ సందడి మామూలే. గ్రేటర్ హైద్రాబాద్ ఎన్నికలు కదా.. సందడి ఇంకాస్త ఎక్కువగా కనిపిస్తోంది. అధికార యంత్రాంగం ఎంతగా చర్యలు చేపడుతున్నా, కరెన్సీ నోట్లతో ఓట్లను కొనేసే ప్రక్రియకి మాత్రం బ్రేక్ పడటం లేదు. మద్యం ఏరులై పారడమూ మానలేదు. చీరలు, ముక్కుపుడకలు, క్రికెట్ కిట్ల పంపిణీలూ ఆగడంలేదు. ‘అత్యద్భుతంగా ఎన్నికలు నిర్వహించేశాం..’ అని రాష్ట్ర ఎన్నికల సంఘాలు, కేంద్ర ఎన్నికల సంఘం ఆయా ఎన్నికల తర్వాత గొప్పగా ప్రకటించేసుకోవడం మామూలే. గ్రౌండ్ లెవల్‌లో దిగజారిపోతున్న ప్రజాస్వామ్య విలువలూ మామూలే.
ఇక, గ్రేటర్ ఎన్నికల విషయానికొస్తే, దాదాపు అన్ని డివిజన్లలోనూ బీభత్సంగా ప్రలోభాల పర్వం నడుస్తోంది. ఎక్కడికక్కడ దావత్‌లు షురూ అయ్యాయి. ప్రచారం జరుగుతున్నన్నాళ్ళూ ఇదే సందడి.. ప్రచారం ముగిశాక ఈ సందడి రెట్టింపు కాదు, పదింతలయ్యిందనడం అతిశయోక్తి కాదేమో. మద్యం అమ్మకాలపై నిషేధం అమల్లో వున్నా సరే.. మద్యం మాత్రం ఏరులై పారుతోందంటే.. ఎక్కడ లోపం జరుగుతున్నట్లు.?
ఆ పార్టీ ఈ పార్టీ అన్న తేడాల్లేవ్.. గెలుపు అత్యవసరం.. అనుకున్న పార్టీలు, అభ్యర్థులు.. అవసరాలకు మించి ఖర్చు చేస్తున్నారు. ఒక్కో ఓటు రేటు.. ఊహించడానికే అందనంత పలుకుతోంది కొన్ని చోట్ల. ఇదా ప్రజాస్వామ్యం.? అని ప్రజాస్వామ్యవాదులు ముక్కున వేలేసుకోవచ్చుగాక. అన్ని పార్టీలూ ఈ విషయంలో సిండికేట్ అయి ప్రలోభాల పర్వానికి తెరలేపుతోంటే.. ఒకరితో ఒకరు పోటీ పడుతోంటే.. ప్రజాస్వామ్యం సిగ్గుతో తలదించుకోక ఏం చేయగలుగుతుంది.?