ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

ఇళయరాజా: ఎట్టకేలకు ప్రసాద్ స్టూడియో నుంచి బయటకు..

ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా ఎట్టకేలకు ప్రసాద్ స్టూడియో నుంచి బయటకు వెళ్లిపోయారు. ఈ విషయంపై స్టూడియో యాజమాన్యానికి, ఇళయరాజాకు మధ్య గత కొన్నేళ్లుగా వివాదం నడుస్తోంది. తాజాగా తనకు సంబంధించిన సంగీత పరికరాలు, అవార్డులను ఆయన సహాయకులు తీసుకుని వెళ్లిపోవడంతో ఈ వివాదానికి ముగింపు పడినట్టయింది. ఇళయరాజా మీద అభిమానంతో ప్రసాద్ స్టూడియో యాజమాన్యం 1976లో ఆయన కోసం ప్రత్యేకంగా రికార్డింగ్ స్టూడియో ఏర్పాటు చేసింది.

అయితే, ఇటీవల ఇరువురి మధ్య మనస్పర్థలు రావడంతో స్టూడియో ఖాళీ చేయాలని యాజమాన్యం కోరింది. అయితే, ఇళయరాజా అందుకు నిరాకరించడంతో వ్యవహారం కోర్టుకు వెళ్లింది. గత రెండేళ్లుగా దీనిపై మద్రాస్ హైకోర్టులో వాదనలు జరుగుతున్నాయి. సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని న్యాయస్థానం సూచించింది. దీంతో స్టూడియోలని తన పరికరాలు, అవార్డులు తీసుకునేందుకు.. ధ్యానం చేసుకునేందుకు అవకాశం కల్పించాలని ఇళయరాజా కోరారు.

ఈ నేపథ్యంలో ఏదో ఒకరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ధ్యానం చేసుకుని సంగీత పరికరాలు తీసుకెళ్లేందుకు అనుమతించాలని స్టూడియో యాజమాన్యాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో సోమవారం ఇళయరాజా వస్తారని చెప్పినా.. ఆయన రాకుండా సహాయకులను పంపించి తన పరికరాలు తీసుకెళ్లారు. రికార్డింగ్ థియేటర్ తలుపులు పగలకొట్టి అందులో సామగ్రి వేరే గదిలో పెట్టారని, ఈ సమాచారం తెలియంతో మనస్తాపానికి లోనై ఇళయరాజా రాలేదని ఆయన పీఆర్వో వెల్లడించారు.

Exit mobile version