‘ఆ ఏమవుతుంది కరోనా వస్తే.? జ్వరమొస్తుందట, పారాసిటమాల్ వేసుకుంటే సరిపోతుందట..’ అన్న నిర్లక్ష్యం ఇప్పుడు కొంప కొల్లేరయిపోయేలా చేసిందన్న ఆవేదన చాలామందిలో కన్పిస్తోంది. రాజధాని అమరావతి (మూడు ముక్కలు చేయాలని ప్రభుత్వం అనుకుంటోందనుకోండి.. అది వేరే విషయం) పక్కనే వున్న బెజవాడ నగరంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. ఆ మాటకొస్తే, గుంటూరు జిల్లాలో పరిస్థితి ఇంకా దారుణంగా వుందనుకోండి.. అది వేరే విషయం. బెజవాడలో పరిస్థితి మరీ దయనీయం.. అని ఎందుకు అనాల్సి వస్తోందంటే, ఇక్కడ ‘కాంటాక్ట్’ (ప్రభుత్వ పెద్దలు చెబుతున్నట్లు కాంట్రాక్ట్ కాదు..) దొరకడంలేదు.
కరోనా పాజిటివ్ కేసులుగా తేలుతున్న కొన్ని కేసుల విషయంలో, అసలు బాధితులకు కరోనా వైరస్ ఎవరిని నుంచి సోకిందో తెలియకపోవడం భయాందోళనలకు కారణమవుతోంది. అహా అద్భుతం.. ఒహో అద్భుతం.. ‘నీ .. డాష్ డాష్..’ అంటూ అదే జిల్లాకి చెందిన ఓ మంత్రిగారు రాజకీయ ప్రత్యర్థులపై బూతులు మాట్లాడటం మీద పెట్టే ఫోకస్, తన జిల్లా ప్రజల మీద పెడితే ఈ పరిస్థితి వచ్చేది కాదేమో.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నివాసం వుంటోన్న ప్రాంతానికి కూత వేటు దూరంలోనే కరోనా పాజిటివ్ కేసులు నమోదువుతున్నాయి. అటు వెళితే గుంటూరు.. ఇటు వెళితే విజయవాడ.. ఇదీ కరోనా స్వైర విహారం కృష్ణా, గుంటూరు జిల్లాల్లో.! నిర్లక్ష్యం.. అడుగడుగునా నిర్లక్ష్యం.. పాలకులదీ, ప్రజలదీ నిర్లక్ష్యమే.. అందుకే బెజవాడకి ఇప్పుడీ దుస్థితి.