వైఎస్ జగన్ సర్కార్ గతంలో 2021లో పోలవరం ప్రాజెక్టు పూర్తయిపోతుందని చెప్పింది. ఇప్పుడేమో 2021 చివరి నాటికి అంటోంది. కేంద్రం 25 వేల కోట్ల నిధులకు కొర్రీ వేసిందంటూ వైఎస్ జగన్ సర్కార్ స్వయంగా చెబుతోంది. మరి, ఆ 25 వేల కోట్ల నిధులూ 2021 డిసెంబర్ నాటికి రాష్ట్రానికి వస్తాయా.? రాకపోతే, ప్రాజెక్టు పూర్తవుతుందని ఎలా చెప్పగలం.? ‘మేం, ఇచ్చిన మాటకు కట్టుబడి.. గడువు లోపలే ప్రాజెక్టుని పూర్తి చేస్తాం. ప్రాజెక్టు ఎత్తు విషయంలో వివాదాలకు తావు లేదు. కావాలంటే, ఎవరైనాసరే టేపు పట్టుకుని వెళ్ళి కొలుచుకోవచ్చు..’ అంటూ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అసెంబ్లీ సాక్షిగా సెటైర్ వేశారు.
ప్రాజెక్టు ఎత్తుని టేపుతో కొలుస్తారు సరే.. ప్రాజెక్టులో నిల్వ చేసే నీళ్ళను ఎలా కొలవాలి.? చెంబులు పట్టుకుని వెళ్లి కొలుచుకోవాలేమో.! దేశంలో పోలవరం లాంటి మరో ప్రాజెక్టు సమీప భవిష్యత్తులో కట్టే అవకాశమే లేదంటే.. ఆ ప్రాజెక్టు ప్రాముఖ్యత ఏంటో అర్థం చేసుకోవచ్చు. కానీ, అంతటి గొప్ప ప్రాజెక్టు ఇంత కామెడీ అయిపోతుందని బహుశా ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు, ఈ ప్రాజెక్టు గురించి కాస్తో కూస్తో తెలిసిన ఇతర రాష్ట్రాలకు చెందినవారూ ఊహించి వుండరు.
పోలవరం ప్రాజెక్టు ఎత్తు విషయంలో గందగరోళం వుంది. నిజానికి, ఎత్తు.. అంటే ఇక్కడ నీటి నిల్వకు సంబంధించిన అంశం. ప్రాజెక్టు పూర్తి చేశామనిపించి, గేట్లు పెట్టేసి.. ఆ గేట్లను దించి, నీటిని నిల్వ చేయకపోతే ప్రాజెక్టు ఫలాలు పూర్తిగా ఎలా దక్కుతాయి.? ‘ఏ ప్రాజెక్టు అయినా పూర్తయ్యాక.. విడతలవారీగా మాత్రమే నీటి నిల్వ చేస్తారు.. కొంచెం కొంచెం పెంచుకుంటూ పోతారు..’ అంటూ వైఎస్ జగన్ ప్రభుత్వం కొత్త పల్లవి అందుకుంటోంది.
తుమ్మితే ఊడిపోయే ముక్కులాంటి ప్రభుత్వాలు నడుస్తున్న రోజులివి. 151 మంది ఎమ్మెల్యేలున్న పార్టీ, జమిలి ఎన్నికలొస్తే.. ఎన్ని సీట్లకు పరిమితమవుతుందో చెప్పలేం. బ్రిటిష్ హయాంలో ప్లానింగ్ జరిగిన ప్రాజెక్టు.. రాజశేఖర్‌రెడ్డి హయాంలో మొదలైన ప్రాజెక్టు.. ఇప్పటికీ ముక్కుతూ మూలుగుతూ వుందంటే, దానిక్కారణం ఎవరు.? ఈ పాలకుల్ని నమ్మేదెలా.?