ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

జగన్‌ సారూ.. ఇంతకీ ‘ఏలూరు పాపం’ ఎవరిది.

వింత అనారోగ్య సమస్యతో దాదాపు 700 మందికి పైగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు ఏలూరు నగరంలో. ఏలూరులో.. అందునా ఓ ప్రాంతంలోనే ప్రత్యేకంగా ఈ అనారోగ్య సమస్య తెరపైకొచ్చింది. ఒకరు ప్రాణాలు కోల్పోయారు అధికారికంగా. అనధికారిక లెక్కల విషయమై కొంత గందరగోళం వుంది. నీటి కాలుష్యమే సమస్యకు కారణమనే చర్చ మొదట్లో జరిగింది. ఏలూరు నగరంలో పారిశుధ్యం సహా అనేక అంశాలు చర్చకు వచ్చాయి. మంచి నీటి చెరువుల్లో కాలుష్య కారకాలు చేరాయంటూ పెద్దయెత్తున మీడియాలో కథనాలూ చూస్తున్నాం. అయితే, తాగునీటిలో ఎలాంటి సమస్యా లేదని అధికారిక నివేదికలు చెబుతున్నాయి. కానీ, బాధితుల శరీరంలో ప్రమాదకర అవశేషాలున్నాయని పరిశోధనల్లో తేలింది.

పురుగు మందుల్లో ఉపయోగించే భార మూలకాలు బాధితుల శరీరంలోకి ఎలా వెళ్ళాయన్నది ఇప్పుడు మిస్టరీగా మారింది. వున్నపళంగా మనిషి కుప్ప కూలిపోవడం.. నోట్లోంచి నురగలు రావడం.. ఫిట్స్‌కి గురవడం.. అచేతనావస్థలోకి వెళ్ళిపోవడం.. ఇదీ బాధితులు ఎదుర్కొన్న పరిస్థితి. అయితే, ఒకరి నుంచి ఇంకొకరికి ఈ అనారోగ్య సమస్య వ్యాప్తి చెందకపోవడం గుడ్డిలో మెల్ల లాంటి వ్యవహారమే. కానీ, సమస్య మూలాలేమిటి.? ఏలూరులో నీటి కాలువల పరిస్థితి ఎలా వుంది.? పారిశుద్య సమస్యల మాటేమిటి.? ఇలా చాలా ప్రశ్నలు తెరపైకొస్తున్నాయి. ‘నీళ్ళలో సమస్య లేదు..’ అనేసి సర్కార్‌ చేతులు దులిపేసుకోవాలనుకుంటోందా.? వ్యవసాయ విధానంలో పురుగుల మందుల వినియోగం పెరిగిపోవడం వల్ల ఇలాంటి సమస్యలు వస్తాయని ఎప్పటినుంచో నిపుణులు పేర్కొంటున్నా.. పాలకులు ఇప్పటిదాకా కళ్ళు తెరవలేదు. అలాగని, తప్పంతా ప్రస్తుత ప్రభుత్వానిదేననీ అనలేం.

అయితే, చర్యలంటూ తీసుకోవాలి కదా.! సంద్రపాయ విధానాల్లో వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తే.. అ తరహా సమస్యలు తగ్గుతాయన్నది నిపుణుల వాదన. కానీ, ఆ స్థాయిలో ప్రభుత్వాలు చిత్తశుద్ధి ప్రదర్శించడాన్ని మనం ఆశించలేం. పోతే పోతాయ్‌. మనుషుల ప్రాణాలే కదా.. అన్నట్టు వ్యవహరించడం పాలకులకు కొత్తేమీ కాదు. తీగ లాగితే, డొంక ఎక్కడో కదులుతుంది. రోజులు గడుస్తున్నా సమస్య తీవ్రతను కనుగొనలేకపోవడమంటే.. అది ప్రభుత్వ వైఫల్యం అనుకోవాలేమో.. అన్న ప్రజల ఆవేదనకు సమాధానం చెప్పేదెవరు.? వైసీపీ గనుక ప్రతిపక్షంలో వుండి వుంటే, ఏలూరు ఘటనపై ఏ స్థాయి రాజకీయం నడిచేదో కదా.!

Exit mobile version