ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

అందరూ జీవితా రాజశేఖర్ నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు?

‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్ అసోషియేషన్) అధ్యక్ష ఎన్నికలు అక్టోబర్ 10వ తేదీన జరుగనున్న నేపథ్యంలో అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న ప్రకాష్ రాజ్ – మంచు విష్ణు ప్యానల్ సభ్యులు ఒకరిపై ఒకరు ప్రెస్ మీట్లు పెట్టి విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా ప్రకాశ్ రాజ్ ప్యానెల్ నుంచి జనరల్ సెక్రటరీ గా పోటీ చేస్తున్న జీవితా మీడియా ముందుకు వచ్చారు. అందరూ జీవితా రాజశేఖర్ ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారో అర్థం కావటం లేదని.. ఎవరు ఏ ప్యానల్ లో ఉన్నా అది వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఉంటుందని జీవిత అన్నారు. తప్పులు చేయడం మానవ సహజమని.. వాటిని తాము సరిదిద్దుకున్నామని.. సినీ కళాకారుల సంఘానికి తోచిన సాయం చేశామని చెప్పారు.

”బండ్ల గణేష్ నా గురించి మాట్లాడారు. అందుకే ఆయనపై మాట్లాడాల్సి వచ్చింది. పృథ్వీ నాపై ఆరోపణలు చేస్తూ ఈసీకి ఫిర్యాదు చేశారు. అందరూ జీవితా రాజశేఖర్ నే టార్గెట్ చేస్తున్నారు. మంచి చేయడమే మేం చేస్తున్న తప్పా? గతంలో ‘మా’ ఎన్నికల్లో పాల్గొనాలని నరేష్ గారే మమ్మల్ని కలిశారు. ఆయన చెప్పిన మాటలు విని ఎన్నికల్లో పోటీ చేశాం. ఆయన ఎవరిని తిడితే వాళ్లను తిట్టాం.. నరేశ్ కు మద్దతుగా నిలిచాం. అయితే ఇవన్నీ ఎన్నికల వరకే పరిమితం చేయాలని రాజశేఖర్ గారు నరేష్ కు సూచించారు. దానికి సరే అన్నారు. ఈ విషయంలోనే మాకు విభేదాలు తలెత్తాయి. డైరీ విడుదల సందర్భంగా ఏం జరిగిందో మీరంతా చూశారు. అప్పటి నుంచే మా మధ్య విభేదాలు మొదలయ్యాయి. ‘మా’ కోసం నరేష్ గారు పనులు చేయలేదని నేను ఎక్కడా చెప్పలేదు” అని జీవిత అన్నారు.

ఇంకా జీవిత మాట్లాడుతూ.. ”నరేష్ అందరినీ కలుపుకొని పోలేదు. అందుకే ఇన్ని సమస్యలు వచ్చాయి. ఏ నిర్ణయం తీసుకుందామన్నా ఎవరినీ పిలిచే వారు కాదు. వాళ్లంతా ఎందుకు? మనం సరిపోతాం కదా అనేవారు. రెండు మూడు ఈసీ మీటింగులు జరిగాయి. అందులో ఒకరినొకరు కొట్టుకోవడమే. అప్పుడు కూడా మేము సర్ది చెప్పాం. ఒక ఫారెన్ ప్రోగ్రామ్ ను నరేష్ గారు నిర్ణయించారు. దాని విషయంలోనే ఆయన రచ్చ రచ్చ చేశారు. చిరంజీవితో సహా పెద్దలందరూ కలిసి ఒక కమిటీ ఏర్పాటు చేసి లావాదేవీలను పరిశీలించారు. చివరకు ఎలాంటి తప్పూ జరగలేదని తేల్చారు. అయినా కూడా నరేష్ అదే అంశంపై ఎన్నికల్లో మాట్లాడి.. ఆ పాయింట్ తోనే గెలిచారు”

”ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఎవరైతే ఆ ఫారెన్ ప్రోగ్రామ్ చేశారో వాళ్ళతోనే మళ్లీ కాంట్రాక్టు కుదుర్చుకుని అడ్వాన్స్ తీసుకున్నారు. వాళ్లలో ఒకరు వచ్చి అమెరికాలో ప్రోగ్రామ్ చేసినందుకు కోటి రూపాయలు ఇస్తామన్నారు. ఇదే విషయాన్ని నరేష్ మాతో చర్చించారు. సమస్య ఎవరి వల్ల అయితే వచ్చిందో వారితోనే మళ్లీ ప్రోగ్రామ్ చేస్తామనడం కరెక్ట్ కాదని మా ప్యానెల్ లోని సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈసీ మీటింగ్ పెట్టి నిర్ణయం తీసుకుందామని నరేష్ కు చెబితే.. ఆయన ఒప్పుకోలేదు. అప్పుడు నరేష్ తో మాకు విబేధాలు వచ్చాయి. అప్పటి నుంచి మేం ఏమి మాట్లాడినా ఆయన తప్పుగా భావించేవారు” అని జీవిత చెప్పారు. తనపై వస్తున్న ఆరోపణల్లో ఒక్కటి నిజమని నిరూపించినా.. కాళ్ళ మీద పడి దండం పెడుతానని అన్నారు.

”మోహన్ బాబు గారు – విష్ణు అంటే నాకు గౌరవం ఉంది. విష్ణు తన సామర్ధ్యంతో ఎన్నికలల్లో పోటీ చేస్తున్నారు. అలాంటిది నరేష్ ను ఎందుకు వెనకేసుకుని తిరుగుతున్నారు?. ‘మా’ లో ప్రాంతీయ వాదాన్ని ఎందుకు తీసుకొస్తున్నారు? ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ గా ఉన్న వారు తెలుగు వాళ్లా? ప్రకాశ్ రాజ్ విషయంలో ఎందుకు ఆ విషయాన్ని తీసుకొస్తున్నారో అర్థం కావటం లేదు. ఇటీవల ఒక పార్టీలో జూనియర్ ఎన్టీఆర్ గారిని కలిశాను. ఓటు వేయమని అడిగితే.. ‘నన్ను అడగొద్దు. ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది’ అని అన్నారు. ఆయన చెప్పినట్లు నిజంగా పరిస్థితి అలాగే ఉంది” అని జీవితా రాజశేఖర్ చెప్పుకొచ్చారు.

ఈ సందర్భంగా పోసాని కృష్ణ మురళి వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ఆయన మాటలు చాలా దారుణమని.. అలా మాట్లాడటం సరికాదని జీవిత రాజశేఖర్ అన్నారు. భవిష్యత్ లో ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలని.. మా ప్యానల్ గెలిస్తే ఇలాంటి వాటిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Exit mobile version