చిరంజీవి అల్లుడిగా ఎంట్రీ వరకే తప్ప సక్సెస్ తీసుకురాదని కల్యాణ్‌దేవ్ అన్నాడు. ఈ సందర్భంగా తన మామ చిరంజీవి హితోపదేశం…‘చిత్ర పరిశ్రమలో బ్యాగ్రౌండ్ ఒక సినిమాకే ఉపయోగపడుతుంది. కష్టంలోనే సుఖం, విజయం దాగి ఉన్నాయి. సినిమా అంటే చూసినంత ఈజీ కాదు’ అని ముందే చెప్పాడని కల్యాణ్ దేవ్ వెల్లడించాడు.
‘సూపర్ మచ్చి’ సినిమాలో తనది మాస్ పాత్ర అన్నాడు. ఇందులో బార్ సింగర్‌గా పాటలు పాడుతూ కనిపిస్తానన్నాడు. కథల ఎంపిక నిర్ణయం తనదే అన్నాడు. కథల ఎంపికలో సాయపడేందుకు ఇద్దరు ఉన్నట్టు ఆయన తెలిపాడు. తన తొలి చిత్రం విజేతకు సంబంధించి చిరంజీవి కథ విన్నట్టు తెలిపాడు. అయితే రెండో సినిమా కథ మాత్రం ఆయన వినలేదన్నాడు.
‘సూపర్ మచ్చి’ షూటింగ్ తర్వాత ఇంట్లో స్వీయ నిర్బంధంలో ఉన్నట్టు తెలిపాడు. దీనివల్ల ముఖ్యంగా పిల్లలకు దూరంగా ఉండాల్సి వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. ఆదివారం తమ పెద్ద కూతురి పుట్టిన రోజన్నాడు. కానీ, తనతో కలిసి ఆ ఆనంద క్షణాలను గడిపే అవకాశం లేదన్నాడు. మరో నాలుగు రోజుల్లో కరోనా టెస్ట్ చేయించుకుని స్వీయ నిర్బంధం నుంచి బయటపడతానన్నాడు.
ఇక తన తాజా సినిమా రిలీజ్ ఎక్కడనేది నిర్మాతల ఇష్టమన్నాడు. ప్రస్తుత పరిస్థితుల్లో థియేటర్లలో సినిమా విడుదల చాలా కష్టంగా ఉందన్నాడు.
అలాగే సినిమా హీరోయిన్‌కు సంబంధించి కల్యాణ్‌దేవ్ ఆసక్తికర విషయం చెప్పాడు. పులి వాసు నేతృత్వంలో తెరకెక్కిన ‘సూపర్ మచ్చి’ చిత్రంలో కల్యాణ్‌దేవ్ సరసన రచితా రామ్ నటించిన విషయం తెలిసిందే. అయితే మొట్ట మొదట ఈ సినిమాకు రియా చక్రవర్తిని హీరోయిన్‌గా తీసుకున్నామని, రెండు వారాల పాటు షూటింగ్ చేశాక సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌తో సినిమా ఉందంటూ మధ్యలోనే వెళ్లిపోయిందని కల్యాణ్‌దేవ్ చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత కన్నడ హీరోయిన్ రచితా రామ్‌ను తీసుకుని రీషూట్ చేసినట్టు ఆయన తెలిపాడు.