రాష్ట్రానికి చెందిన ఓ మంత్రివర్యులు ఓ సినీనటి, యాంకర్ తో జరిపిన అసభ్య సంభాషణలు అందులో ఉన్నాయి. నిజానికి ఇలాంటివి ఏవైనా ప్రతిపక్ష నేతలకు సంబంధించినవి దొరికితే అధికార పార్టీ వారితో ఆటాడుకుంటుంది. అదే అధికార పార్టీకే చెందినవారివైతే తొక్కిపెడుతుంది. కానీ ఈ మంత్రి విషయంలో మాత్రం టీఆర్ఎస్ విభిన్నంగా స్పందించింది.
నిజానికి ఈ వ్యవహారం టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఉండే ఛానల్ లో వస్తే ఎవరూ అంతగా పట్టించుకుని ఉండేవారు కాదు. కానీ ప్రభుత్వ పెద్దలతో సన్నిహిత సంబంధాలున్న మైహోం గ్రూప్ నిర్వహిస్తున్న టెన్ టీవీలోనే దీనిని పదేపదే ప్రసారం చేయడంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.
ఆ మంత్రిని కేబినెట్ నుంచి తప్పించడానికి ప్రభుత్వ పెద్దలు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇక్కడ ఆ మంత్రి చేసింది తప్పే. ఆయన్ను ఎవరూ సమర్థించడంలేదు. సదరు నటిపై మనసు పారేసుకున్న అమాత్యులు.. ఆమెను నెమ్మదిగా వశం చేసుకోవాలని ప్రయత్నించారనడానికి గట్టి ఆధారాలే ఉన్నాయి.
అయితే, ఆమె ఎదురు తిరగడంతో రాజీ కుదుర్చుకోవడానికి మంత్రి ప్రయత్నించారని.. ఇందులో భాగంగానే ఆయన హోటల్ కి వెళ్లారని కథనాలు వచ్చాయి. ఈ వ్యవహారాన్ని టెన్ టీవీ ప్రసారం చేయకుంటే పెద్దగా ఎవరికీ తెలిసేది కాదు. సరిగ్గా ఈ దశలోనే ఇంటెలిజెన్స్ రంగప్రవేశం చేసి మంత్రివర్యులకు వ్యతిరేకంగా కీలక ఆధారాలు సేకరించింది. కావాలనుకుంటే ప్రభుత్వం వీటిని మరుగున పడేసే అవకాశం ఉంది.
కానీ టీఆర్ఎస్ ఇక్కడే తన తెలివి ఉపయోగించిందని.. కేబినెట్ నుంచి ఆ మంత్రిని బయటకు పంపించడానికి ఇదో చక్కని అవకాశమని భావించిందని చర్చ జరుగుతోంది. ఇటీవల శాసనమండలికి ఎన్నికైన తన కుమార్తె కవితను కేబినెట్ లోకి తీసుకునేందుకు వీలుగా సదరు మంత్రిని పదవి నుంచి తొలగించాని సీఎం కేసీఆర్ నిర్ణయానికి వచ్చారని అంటున్నారు. నిజానికి కవితను ఎమ్మెల్సీగా చేసినప్పుడే ఆమెకు మంత్రి పదవి ఖాయమనే చర్చ జరిగింది.
అయితే, కుమార్తె కోసం ఎవరినైనా తీసేసినా లేదా రాజీనామా చేయాలని కోరినా ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని అధిష్టాన పెద్దలు భావించారు. సరిగ్గా ఇదే సమయంలో ఆ మంత్రివర్యులు చాటింగుతో బుక్కయిపోవడం ఇలా కలిసి వచ్చిందని అంటున్నారు. ఈ వ్యవహారంలో సదరు మంత్రి రాజీనామా చేయడం ఖాయమని.. అనంతరం ఆ బెర్తును కవితకు ఇస్తారనే చర్చ జరుగుతోంది.