అలాంటివేమీ చేసేందుకు సిద్ధపడని ప్రభుత్వాల తీరుకు భిన్నమైన నిర్ణయాన్ని తీసుకున్నారు సీఎం కేసీఆర్. తెలంగాణ రాష్ట్రంలో అనుమతులు తీసుకున్న దానికి ఏ మాత్రం సంబంధం లేకుండా నిర్మించే నిర్మాణాలకు రిజిస్ట్రేషన్లు చేసే విధానానికి బంద్ చేస్తూ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు.
ఇప్పటివరకు రెండు అంతస్తులకు అనుమతి తీసుకొని మూడు అంతస్తులు వేయటం.. మూడు అంతస్తులకు అనుమతి తీసుకొని ఐదు అంతస్తుల్ని నిర్మించే తీరుకు చెక్ పెట్టేందుకు అవరమైన కీలక విధివిధానాల్ని సిద్ధం చేశారు. ప్రభుత్వానికి ఆదాయం తగ్గినా ఫర్లేదు.. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరిపిన అనధికార నిర్మాణాలకు రిజిస్ట్రేషన్లు బంద్ చేయాలని డిసైడ్ చేశారు.
రాష్ట్రంలో ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి జరగాలన్నదే ప్రభుత్వ ఆలోచనగా పేర్కొంటూ మార్గదర్శకాల్ని జారీ చేయటమే కాదు.. తక్షణమే అమల్లోకి వస్తాయని.. ఈ నిబంధనల్ని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించటం గమనార్హం. అనధికార నిర్మాణాలకు ఎట్టి పరిస్థితుల్లో రిజిస్ట్రేషన్లు చేయకూడదని అన్ని జిల్లాల రిజిస్ట్రార్లు.. సబ్ రిజిస్ట్రార్లకు ఆదేశాలు జారీ చేసింది కేసీఆర్ సర్కారు.
ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతున్న అనధికార నిర్మాణాలకు తాజా నిర్ణయం భారీ షాక్ గా మారుతుందని చెప్పక తప్పదు. అదే సమయంలో.. తాజా నిర్ణయంతో రాష్ట్రంలో ప్రణాళిక బద్ధమైన అభివృద్ధికి అవకాశం ఉంటుందని చెబుతున్నారు.