ఇల్లు పూర్తిగా కూలిపోతే, లక్ష రూపాయలు ఇవ్వాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. పాక్షికంగా ఇల్లు ధ్వంసమయితే 50 వేల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తారు. రేపటినుంచే అధికారులు, ఈ ఆర్థిక సహాయాన్ని బాధితులకు అందించనున్నారు. ఈ సమయంలో ప్రభుత్వం తరఫున ఏ చిన్న సాయం అందినా అది గొప్ప విషయమే.
అయితే, ఇంకా చాలా ప్రాంతాల్లో ప్రజలు తాగు నీటికీ ఇబ్బందులు ఎదుర్కొంటుండడం అత్యంత బాధాకరమైన విషయం. అధికారులు, సహాయక చర్యలు చేపట్టడంలో పూర్తిస్థాయిలో విఫలమయ్యారన్న విమర్శలు వినిపిస్తున్న వేళ, ఇంటింటికీ 10 వేల సాయం.. అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన భరోసా, బాధిత కుటుంబాలకు కొంత ఊరటగానే చెప్పుకోవాలేమో.
అయితే, గ్రేటర్ హైద్రాబాద్ ఎన్నికలు అతి త్వరలో జరగనున్న దరిమిలా, ఇది వరద సాయం కాదనీ.. ఎన్నికల తాయిలం అనే విమర్శలూ వినిపిస్తున్నాయి. కాగా, వరద సాయం నిమిత్తం, మునిసిపల్ శాఖకు కేసీఆర్ ప్రభుత్వం 550కోట్లకు పైగా నిథుల్ని తక్షణం విడుదల చేస్తుండడం గమనార్హం.
‘వరద పీడిత ప్రజల్ని ఆదుకునేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. వీలైనంత త్వరగా ముంపు ప్రాంతాల్లోని ప్రజలు కోలుకోవాలి.. యుద్ధ ప్రాతిపదికన రోడ్ల పునరుద్ధరణ చర్యలు చేపట్టాలి..’ అంటూ అధికారుల్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఇదిలా వుంటే, హైద్రాబాద్‌లో భారీ వర్షాలు మరో రెండు మూడు రోజులు కొనసాగే అవకాశం వుంది. ఈ రోజు కూడా కొన్ని చోట్ల భారీ వర్షపాతం నమోదవుతోంది. లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి.