ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

కేసీఆర్‌ వర్సెస్‌ విజయశాంతి.. నటనలో ఎవరు బెస్ట్‌.?

‘నా కంటే పెద్ద నటుడు కేసీఆర్‌..’ అంటూ బీజేపీ నేత, మాజీ ఎంపీ విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను తెలంగాణ కోసం ఉద్యమిస్తున్న సమయంలో కేసీఆర్‌, టీడీపీలో వున్నారన్నది విజయశాంతి తాజా ఉవాచ. తాను తెలంగాణ ఉద్యమంలో దూసుకుపోతోంటే, కేసీఆర్‌ ఆలె నరేంద్ర ద్వారా రాయబారం పంపారంటూ రాములమ్మ చేసిన వ్యాఖ్యలిప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారాయి.

కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ ఇచ్చినప్పుడు, తనను హడావిడిగా పార్టీ నుంచి సస్పెండ్‌ చేసి, కాంగ్రెస్‌ అధిష్టానంతో కేసీఆర్‌ టచ్‌లోకి వెళ్ళారనీ విజయశాంతి ఎద్దేవా చేశారు. అరరె, దేవుడిచ్చిన చెల్లి తనను ఇంతలా విమర్శించేస్తోంటే, కేసీఆర్‌ ఏం చేస్తున్నట్లు.? నిజానికి, విజయశాంతి విమర్శలకు సమాధానం చెప్పేంత తీరిక అయితే కేసీఆర్‌కి వుండి వుండకపోవచ్చు.

తల్లి తెలంగాణ పార్టీ, టీఆర్‌ఎస్‌లో విలీనమైనమాట వాస్తవం. అలా విలీనం చేయబట్టే, విజయశాంతికి ఎంపీ టిక్కెట్‌ దక్కింది. లేకపోతే, విజయశాంతి ఎంపీ అయ్యేవారా.? ఛాన్సే లేదన్నది టీఆర్‌ఎస్‌ శ్రేణుల వాదన. అంతకు ముందు వరకు బీజేపీ అంటే చాలా చాలా గొప్ప విజయశాంతికి. ఆ తర్వాత టీఆర్‌ఎస్‌ మీద అమితమైన ప్రేమ. కొన్నాళ్ళు కాంగ్రెస్‌ పార్టీ నేతగా విజయశాంతి హల్‌ చల్‌ చేశారు. కొద్ది రోజుల క్రితమే కాంగ్రెస్‌ని వీడి, బీజేపీలో చేరిన విజయశాంతి.. ఇప్పుడు కొత్త పల్లవి అందుకుంటున్నారు.

మారేందుకు విజయశాంతికి ఇంకేమన్నా పార్టీలున్నాయా.? ఏమోగానీ, ‘నాకంటే గొప్ప నటుడు కేసీఆర్‌..’ అంటూ విజయశాంతి చేసిన వ్యాఖ్యలు ఒకింత ఫన్నీగా కూడా మారిపోయాయి. కేసీఆర్‌, రాజకీయ వ్యూహాలు ఎలా వుంటాయో ఊహించడం అంత తేలిక కాదు. అవసరమైతే, టీఆర్‌ఎస్‌ – బీజేపీకి మిత్రపక్షంగా మారిపోవచ్చు కూడా. అదే జరిగితే, విజయశాంతి పరిస్థితి ఏంటట.?

రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు. అయినా, కొత్తగా బీజేపీ రెక్కలు తొడుక్కున్న విజయశాంతి, ఎన్నాళ్ళు ఆ పార్టీని అంటిపెట్టుకుని వుంటారో, ఎంత కాలం ఆ పార్టీ నుంచి తన వాయిస్‌ని బలంగా విన్పిస్తారో.. ఇప్పుడే చెప్పడం తొందరపాటు అవుతుంది.

Exit mobile version