ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

పోతిరెడ్డిపాడుకి షాక్‌.. కేసీఆర్‌ ఢిల్లీ టూర్‌ సక్సెస్‌.?

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన పోతిరెడ్డి ప్రాజెక్టు (ఎత్తిపోతల) విస్తరణకు కేంద్రం రెడ్‌ సిగ్నల్‌ వేసింది. ఇటీవలే కేసీఆర్‌, ఢిల్లీకి వెళ్ళి కేంద్ర జల శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌తో భేటీ అయి, పలు అంశాలపై చర్చించిన విషయం విదితమే. వీటిలో కాళేశ్వరం సహా పలు ప్రాజెక్టుల ప్రస్తావన వచ్చింది.

అదే సమయంలో, ఆంధ్రప్రదేశ్‌ తలపెట్టిన పోతిరెడ్డి ప్రాజెక్టు విస్తరణతో తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతింటాయని కేసీఆర్‌, కేంద్ర మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఇంతలోనే, కేంద్రం నుంచి ఇరు రాష్ట్రాలకూ పోతిరెడ్డి ప్రాజెక్టు విషయమై సమాచారం వచ్చింది. పోతిరెడ్డి ప్రాజెక్టు విస్తరణ విషయంలో ముందుకు వెళ్ళొద్దంటూ ఆంధ్రప్రదేశ్‌కి అల్టిమేటం జారీ చేసింది కేంద్రం. ఇదే సమాచారం తెలంగాణకూ వచ్చింది.

అంటే, ఓ రకంగా కేసీఆర్‌, ఢిల్లీ టూర్‌ సక్సెస్‌ అయినట్లే. రాయలసీమకు వరప్రదాయనిగా పోతిరెడ్డి ప్రాజెక్టు విస్తరణ వ్యవహారాన్ని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం చెబుతున్న విషయం విదితమే. ఇందుకోసం భారీ ప్రణాళికలూ సిద్ధం చేసుకుంది. రాష్ట్రంలో పెద్దయెత్తున రాజకీయం కూడా నడిచింది ఈ వ్యవహారం చుట్టూ. ఇంతలోనే, ఈ ప్రాజెక్టుకి ఇప్పుడు రెడ్‌ సిగ్నల్‌ పడటం గమనార్హం.

ఇక, తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కేంద్రం సమన్యాయం చేయకపోయినప్పటికీ, సమ అన్యాయం మాత్రం చేస్తూ వస్తోంది. తెలంగాణకు సంబంధించి పలు కీలక ప్రాజెక్టుల విషయమై ముందుకెళ్ళొద్దని కేంద్రం ఆదేశించింది. నిజానికి, వీటిల్లో చాలా విషయాలపై ఆంధ్రప్రదశ్‌ ప్రభుత్వం, గతంలో కేంద్రానికి ఫిర్యాదు చేసింది. అంటే, ఆంధ్రప్రదేశ్‌ వాదన నెగ్గిందనుకోవాలన్నమాట.

అవును, అటు ఆంధ్రప్రదేశ్‌ నెగ్గింది.. ఇటు తెలంగాణ కూడా నెగ్గింది.. కానీ, రెండు రాష్ట్రాలూ తమ ప్రయోజనాల విషయంలో ఓడిపోయాయి. ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయాక, పరస్పర అవగాహనతో సమస్యల్ని పరిష్కరించుకోవాల్సిందిపోయి, రచ్చకెక్కుతుండడం.. రాజకీయ ప్రయోజనాలే పరమార్ధంగా ఇరు రాష్ట్రాల్లోని అధికార పార్టీలు వ్యవహరిస్తుండడంతో రెండు రాష్ట్రాలకీ సమ అన్యాయం జరుగుతోంది. మరీ, ముఖ్యంగా కాస్త ఎక్కువ అన్యాయం ఆంధ్రప్రదేశ్‌కి జరుగుతోంది.

Exit mobile version