భూముల అమ్మకాలు, కొనుగోళ్ళు.. ఈ ప్రక్రియలో చోటు చేసుకుంటోన్న అవినీతి, అక్రమాల నేపథ్యంలో, ఈ మొత్తం వ్యవస్థలో సమూల మార్పులు తెస్తామంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పట్లో నినదించారు. ఈ క్రమంలోనే ‘ధరణి’ అంశం తెరపైకొచ్చింది. కొత్త విధానం కంటే, పాత విధానమే బెటర్.. అన్న వాదన సర్వత్రా వెల్లువెత్తిన వేళ, కేసీఆర్ సర్కార్ దిగిరాక తప్పలేదు.
తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ తీసుకున్న నిర్ణయాల్లో ఇదే అతి పెద్ద ఫెయిల్యూర్‌గా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో, ఒక్కో అంశం మీదా వెనుకడుగు వేస్తూ.. ప్రభుత్వంపై ఏర్పడ్డ నెగెటివ్ ఇమేజ్‌ని తగ్గించేందుకు శక్తివంచన లేకుండా కృషిచేస్తున్నారు. ఇదిలా వుంటే, ఉద్యోగులకు కేసీఆర్ సర్కార్ తాజాగా కొత్త వరాలు ప్రకటించింది. అన్ని శాఖల ఉద్యోగులకు వేతనాలు, పదవీ విరమణ వయస్సుని పెంచాలంటూ కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు చీఫ్ సెక్రెటరీ సోమేష్‌కుమార్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.
హోంగార్డులు, అంగన్ వాడీ వర్కర్లు, ఆశా వర్కర్లు.. గౌరవ వేతనాలు అందుకుంటున్నవారికి కూడా ప్రయోజనం కలిగించేలా వేతనాల పెంపు వుండబోతోందట. సుమారు 9 లక్షల మంది ఉద్యోగులకు ఈ పెంపు వర్తిస్తుందని కేసీఆర్ ప్రకటించడం గమనార్హం. ఇవే కాదు, ప్రమోషన్లు, ట్రాన్స్‌ఫర్లు.. ఇలా అన్ని విషయాల్లోనూ ఉద్యోగులకు కేసీఆర్ తీపి కబురు చెబుతున్నారు.
కారుణ్య నియామకాల విషయంలోనూ కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లే కనిపిస్తోంది. ఇవన్నీ గ్రేటర్ ఎన్నికల ఎఫెక్ట్ కారణంగానే జరుగుతున్నాయా.? అంటే, అవుననే చెప్పాలేమో.! ఏదిఏమైనా, కేసీఆర్‌లో ఈ మార్పు, తెలంగాణ సమాజంలో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. దుబ్బాక దెబ్బ, గ్రేటర్ ఎన్నికల దెబ్బ.. కేసీఆర్‌లో ఇంతటి మార్పుని తీసుకొచ్చాయన్నమాట.