ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

కేసీయార్ క్లారిటీ ఇచ్చినా.. ‘చీలిక’ పుకార్లు ఆగట్లేదెందుకు.!

‘ఇంకో పదేళ్ళు నేనే ముఖ్యమంత్రిని.. కేటీయార్ ముఖ్యమంత్రి అవుతారనే ప్రచారం ఎందుకు జరుగుతోందో అర్థం కావడంలేదు. ఇకపై, ఈ తరహా వ్యాఖ్యలు టీఆర్ఎస్ నేతలెవరైనా చేస్తే, చర్యలు తీసుకుంటాం..’ అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు నిన్ననే పార్టీ కార్యవర్గ సమావేశంలో స్పష్టం చేసిన విషయం విదితమే.

అయినాగానీ, ‘కేటీయారే కాబోయే ముఖ్యమంత్రి..’ అంటూ ప్రచారం మాత్రం మరింత ఉధృతంగా కొనసాగుతోంది. ‘ఔను, కేటీఆర్ కాబోయే ముఖ్యమంత్రి.. అలాగని మేం అంటే, అదెలా తప్పవుతుంది..’ అని కొందరు టీఆర్ఎస్ నేతలు తెగేసి చెబుతున్నారు. మరోపక్క, పార్టీలో అంతర్గత కుమ్ములాటలు పెరిగిపోయాయనీ, పార్టీపై పట్టు మరింత పెంచుకోవడం కోసం కేటీఆర్, తన ఉనికిని చాటుకునేందుకు కవిత పోటీ పడుతున్న దరిమిలా, ఈ పోటీని ఇష్టపడని గులాబీ నేతలు, ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారన్నది రాజకీయ విశ్లేషకుల వాదన.

ఈటెల రాజేందర్ కావొచ్చు, మరో గులాబీ ముఖ్య నేత కావొచ్చు.. పార్టీలో జరుగుతున్న అంతర్గత పరిణామాలపై కలత చెందుతున్నట్లే కనిపిస్తోంది. స్వామిగౌడ్ లాంటి నేత పార్టీ మారాల్సి వచ్చిందంటే దానికి కారణమేంటి.? అన్నది పార్టీ అధిష్టానం ఆత్మవిమర్శ చేసుకోవాలి. రసమయి బాలకిషన్ కావొచ్చు, శ్రీనివాస్ గౌడ్ కావొచ్చు.. పలు వేదికలపై పరోక్షంగా తమ ఆవేదననీ, అసహనాన్నీ వెల్లగక్కుతూనే వున్నారు. వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకుంటే, గులాబీ పార్టీలో ఏదో జరగరానిది జరుగుతోందనే వాదనలకు బలం చేకూరకమానదు.

‘నేను ముఖ్యమంత్రి అభ్యర్థిని కాను.. కేసీఆర్ నేతృత్వంలోనే పనిచేస్తాను..’ అని కేటీయార్ ఇప్పటిదాకా స్పష్టం చేయలేదు.. ‘కేటీఆర్ ముఖ్యమంత్రి’ అనే ప్రచారం మొదలయ్యాక. తన సమక్షంలోనే గులాబీ నేతలు తనను కీర్తిస్తోంటే, కేటీఆర్ ముసిముసి నవ్వులు నవ్వారంటే, అట్నుంచి వస్తున్న విషెస్‌ని ఎంజాయ్ చేశారంటే.. దానర్థమేంటి.? ‘నేనే ముఖ్యమంత్రిని..’ అని కేసీఆర్ చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది.? ఉద్యమ తెలంగాణ పార్టీ, రాజకీయ తెలంగాణ పార్టీగా.. టీఆర్ఎస్‌లో ఎందుకు బేదాభిప్రాయాలు వస్తున్నాయో కేసీఆర్ తెలుసుకోలేకపోతే.. ఖచ్చితంగా చీలిక వచ్చి తీరుతుంది గులాబీ పార్టీలో.

Exit mobile version