ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

చీపురుతో మళ్ళీ ఊడ్చేసిన కేజ్రీవాల్ పార్టీ ‘ఆప్’.!

ఢిల్లీ నుంచి కాంగ్రెస్ పార్టీనీ, భారతీయ జనతా పార్టీని తరిమికొట్టిన ఘనత ‘సామాన్యుడు’ అరవింద్ కేజ్రీవాల్‌దేనన్నది నిర్వివాదాంశం. ఇప్పుడు పంజాబ్‌లోనూ కేజ్రీవాల్ మ్యాజిక్ పనిచేసింది. అక్కడ బంపర్ మెజార్టీ దక్కించుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది ఆమ్ ఆద్మీ పార్టీ.

‘దేశానికి నాయకత్వం వహించబోతున్నాం..’ అంటూ అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ఎన్నికల్లో తమ పార్టీ గెలుపు తర్వాత వ్యాఖ్యానించారు. ‘కేజ్రీవాల్ అంటే దేశ ద్రోహి కాదు.. కేజ్రీవాల్ అంటే దేశభక్తుడు.. ఆ విషయాన్ని పంజాబ్ ప్రజలు నిరూపించారు..’ అని కేజ్రీవాల్ వ్యాఖ్యానించడం గమనార్హం.

నిజానికి, గోవాపైనా కేజ్రీవాల్ ప్రత్యేక శ్రద్ధ పెట్టాలనుకున్నారుగానీ, కొన్ని కారణాలతో అది వీలు కాలేదు. అయితే, ముందు ముందు మరిన్ని రాష్ట్రాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విస్తరిస్తుందన్నది కేజ్రీవాల్ ధీమాగా కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి.. అంటే, 2024 ఎన్నికల నాటికి కేంద్రంలో బీజేపీకి ప్రత్యామ్నాయంగా మారతామనీ.. 2029 ఎన్నికల నాటికి కేంద్రంలో అధికారంలోకి వస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ చెబుతోంది.

‘కొత్త భారతదేశం ఆవిష్కరణ ఆమ్ ఆద్మీ పార్టీ లక్ష్యం.. దేశంలో అవినీతికి చోటుండకూడదు..’ అంటూ కేజ్రీవాల్ స్పష్టం చేస్తున్నారు.

ఏదిఏమైనా, ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ తిరిగి అధికారం దక్కించుకోవడం కంటే కూడా బ్రహ్మాండమైన విజయంగా పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీకి దక్కిన గెలుపు గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అలా చర్చ జరగడానికి కారణం అరవింద్ కేజ్రీవాల్ సామాన్యుడు కావడమే.!

Exit mobile version