కేరళ సీఎం పినరయి విజయ్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విట్టర్లో వెల్లడించారు. చికిత్స కోసం కోజికోడ్ వైద్య కళాశాలలో చేరుతున్నట్టు ప్రకటించారు. తనను ఇటివల కలిసిన వారంతా కోవిడ్ టెస్టులు చేయించుకోవాలని కోరారు. మార్చి 3న విజయన్ కోవిడ్ టీకా తొలి డోస్ తీసుకోవడం విశేషం. విజయన్ కుమార్తె వీణ కోవిడ్ బారిన పడ్డారు. ఈనెల 6న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పీపీఈ కిట్ ధరించి ఓటు వేశారు.
మరోవైపు కేరళలో కోవిడ్ కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లోనే 4353 కేసులు నమోదవడం కలకలం రేపుతోంది. 18 మంది మృతి చెందారు. మొత్తం మృతుల సంఖ్య 4728కి చేరుకుంది. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 33261 ఉన్నాయి. గతేడాది కోవిడ్ నియంత్రణలో ఆ రాష్ట్రం సమర్ధవంతంగా పని చేసింది. దేశంలో తొలి కరోనా కేసు కూడా కేరళలోనే వెలుగు చూసింది.