‘నేను గెలిచిన వ్యక్తిని.. ఓడిపోయినవారు నా మీద పెత్తనం చేస్తానంటే కుదరదు..’ అంటూ కేశినేని తాజాగా చేసిన వ్యాఖ్యలతో టీడీపీలో పెను దుమారం బయల్దేరింది. ఈ వ్యవహారంపై అధినేత గుస్సా అయ్యారు. టీడీపీ అనుకూల మీడియా సంగతి సరే సరి. ‘కేశినేని నానికి చంద్రబాబు వార్నింగ్’ అంటూ ప్రచారం చేసింది పచ్చ మీడియా. దానికి కేశినేని నాని తనదైన స్టయిల్లో సమాధానమిచ్చారు.
మరోపక్క, కేశినేని నానితో సర్దుకుపోలేనంత విభేదాలేమీ లేవని టీడీపీ నేత బుద్ధా వెంకన్న తాజాగా సెలవిచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచారు. నానికీ, వెంకన్నకీ మధ్య బెజవాడ కేంద్రంగా గత కొద్ది రోజులుగా రచ్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రతిసారీ బుద్ధా వెంకన్నని కేశినేని కెలకడం.. ఆ తర్వాత ఇద్దరి మధ్యా మాటల యుద్ధం తెరపైకి రావడం, ఈ క్రమంలో బెజవాడ కొబ్బరి చిప్పలనే ఆరోపణలు వినిపిస్తుండడం తెలిసిన సంగతులే.
మొత్తమ్మీద బుద్ధా వెంకన్న సర్దుకుపోయారు చంద్రబాబు సూచనతో. ఇంకేముంది కేశినేని నాని కూడా చల్లబడ్డారు. బెజవాడ కార్పొరేషన్ ఎన్నికల వేళ టీడీపీలో ఈ అలజడి.. పార్టీ శ్రేణుల్ని ఆశ్చర్యానికి గురిచేసింది. ‘ఇందుకే కదా పార్టీ సర్వనాశనమైపోతున్నది..’ అంటూ తెలుగు తమ్ముళ్ళు వాపోతున్నారు. నిజమే మరి.. పార్టీ నేతలపై అధినేతకు ‘పట్టు’ లేదు, అధినేత మీద పార్టీ నేతలెవరికీ నమ్మకం లేదు. అందుకే టీడీపీకి ప్రస్తుత దుస్థితి దాపురించింది.