ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైద్య ఆరోగ్య రంగంపై బోల్డంత ఖర్చు చేస్తున్నామని చెప్పుకుంటోంది. ఆసుపత్రుల రూపు రేఖలు మార్చేశామంటోంది. ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యుల లభ్యతను పెంచేశామంటోంది. ఆరోగ్యశ్రీ అంటోంది.. ఇంకోటేదో హడావిడి చేస్తోంది. అయినాగానీ, వైసీపీ నేతలకే ఆంధ్రప్రదేశ్‌లో అందుతున్న వైద్యంపై నమ్మకం వుండడంలేదు.
తాజాగా మంత్రి కొడాలి నానికి కోవిడ్ సోకింది. వెంటనే ఆయన హైద్రాబాద్‌కి పయనమయ్యారు.. హైద్రాబాద్‌లోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో ఆయన చేరిపోయారు. ‘కోవిడ్ పట్ల భయపడాల్సిన పనిలేదు.. ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ సర్వసన్నద్ధంగా వుంది.. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొంటాం..’ అంటూ ఏపీ ప్రభుత్వం ఘంటాపథంగా చెబుతున్న వేళ, సొంత పార్టీ నేతలే.. వైసీపీ ప్రభుత్వం చెబుతున్న మాటల్ని విశ్వసించలేని పరిస్థితి ఎందుకు వస్తోందో ఏమో.!
అనారోగ్యం సంభవించినప్పుడు ఎవరైనా ఎక్కడైనా వైద్య చికిత్స పొందవచ్చుగాక. ఇందుకు వైసీపీ నేతలేమీ మినహాయింపు కాదు. ప్రాణమ్మీదకు వస్తే ఎవరైనా ఒకటే. ప్రాణం కంటే విలువైనది ఏదీ లేదు. ఈ విషయంలో వైసీపీ నేతల్ని విమర్శించడానికేమీ లేదు.. వారెక్కడ వైద్య చికిత్స పొందినాసరే.
కానీ, వైసీపీ నేతలు.. రాష్ట్రంలో వైద్య సౌకర్యాలపై చేస్తున్న ప్రచారానికీ, అక్కడ వాస్తవ పరిస్థితులకీ పొందన వుండడంలేదన్నదే అసలు చర్చ. పబ్లిసిటీ పీక్స్‌లో వుందంటే, మేటర్ పరమ వీక్‌గా వుందనే అర్థం కదా.? అని వైసీపీ నేతలు కరోనా సోకగానే హైద్రాబాద్ పయనమవుతున్న తీరు చూసి నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
కీలక బాధ్యతల్లో వున్నవారే ఇలా చేస్తే, సాధారణ ప్రజానీకానికి దిక్కెవరు.? రాష్ట్రంలో వైద్య సౌకర్యాలపై ప్రజలకు భరోసా కల్పించేదెవరు.?