పవన్ కళ్యాణ్‌ని విమర్శిస్తే రాజకీయంగా ఎదుగుతామనుకుని బొక్క బోర్లా పడిన నాయకుల్లో కొడాలి నాని పేరుని ముందు వరుసలో పెట్టాలేమో. లేకపోతే, నియోజకవర్గంలో ప్రజల సమస్యలు పరిష్కరించడం చేత కావట్లేదుగానీ, జనసేనాని మీద విమర్శలు చేయడంలో ఆయన అగ్గిమీద గుగ్గిలం అయిపోతుంటారు.
తాజాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, పార్టీ ముఖ్య నేతలతో కీలక సమావేశం నిర్వహించారు. పదవులు పోయిన నాయకులకు, ‘క్యాబినెట్ హోదా’తో పదవులు ఇస్తామంటూ ఆశ చూపారు. వచ్చే ఎన్నికల కోసం కలిసి పని చేయాలంటూ సూచనలు చేశారు.
‘హమ్మయ్య.. మంత్రి పదవి పోయినా, క్యాబినెట్ హోదా పదవి దక్కబోతోంది..’ అన్న ఆనందంలో జనసేనాని మీద కొడాలి నాని షరామామూలుగానే సెటైర్లు వేసేశారు. నియోజకవర్గంలో రోడ్లకు పడిన గుంతల వ్యవహారంపై కొడాలి నాని మంత్రిగా వున్నప్పుడూ చిత్తశుద్ధి చూపలేదు.. క్యాబినెట్ ర్యాంకుతో ఇంకో పదవి వస్తే మాత్రం, ఆయన ప్రజల గురించి ఆలోచిస్తారా.?
పదవి వచ్చిందే, పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేయడానికన్నట్టు వైసీపీలో కొందరు వ్యవహరిస్తున్నారు. ఆ లిస్టులో కొడాలి నానిదే తొలి పేరు. మంత్రి పదవి పోతే మరింతగా చెలరేగిపోతా.. విశ్వ రూపం చూపిస్తా.. అంటూ ఇదిగో ఇప్పుడు, క్యాబినెట్ హోదాతో పదవి కోసం అర్రులు చాస్తూ, అధినేత మెప్పు కోసం.. పవన్ కళ్యాణ్ మీద విమర్శల దాడి షురూ చేశారు.
ఆ విశ్వ రూపమేదో ప్రజా సమస్యల పరిష్కారం కోసం చూపించి వుంటే, రాష్ట్రానికి కాస్తయినా మేలు జరిగేది.. ప్రజా ప్రతినిథులుగా తమనెన్నుకున్న ప్రజలకు కాస్తంతైనా ఊరట కలిగేది.