ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

మంత్రి కొడాలి నానిలో ఈ మార్పుకి కారణమేంటి.?

పంచాయితీ ఎన్నికల నేపథ్యంలో జనసేన పార్టీ నుంచి అధికార వైసీపీకి గట్టి షాక్‌లే తగిలినట్లు ఆ పార్టీ నేతలు ప్రత్యక్షంగా, పరోక్షంగా చేస్తున్న వ్యాఖ్యలని బట్టి అర్థమవుతోంది. తాను అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహిస్తోన్న నియోజకవర్గానికి చెందిన ఓ గ్రామంలో జనసేన – వైసీపీ మధ్య పోటీ జరిగితే, స్వల్ప మెజార్టీతో వైసీపీ ఓడి, జనసేన గెలిచిందన్న విషయాన్ని మంత్రి కొడాలి నాని అంగీకరించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

కొన్నాళ్ళ క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాన్ కృష్ణా జిల్లాలో పర్యటించిన సందర్భంలో ‘బోడి లింగం..’ అనే వివాదం తెరపైకొచ్చిన విషయం విదితమే. మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, ఆళ్ళ నాని సహా.. మరికొందరు వైసీపీ ముఖ్య నేతలు ఈ వ్యవహారంపై తీవ్రంగా కలత చెందుతూ, జనసేన అధినేతపై తీవ్రస్థాయి పదజాలంతో విరుచుకుపడ్డారు. కానీ, పంచాయితీ ఎన్నికల నాటికి సీన్ మారిపోయింది.

తన నియోజకవర్గంలో ఓ గ్రామంలో టీడీపీ తన అభ్యర్థిని నిలబెట్టలేదనీ, ఆ కారణంగా జనసేన – వైసీపీ మాత్రమే తలపడాల్సి వచ్చిందనీ, ఓ సామాజిక వర్గం జనసేనకు పూర్తిగా అండగా నిలబడేసరికి, వైసీపీ ఓడిపోయిందని సాక్షాత్తూ కొడాలి నాని ప్రకటించడం గమనార్హం.

‘కుల రహిత పాలన అందిస్తున్నాం..’ అని ఓ పక్క చెబుతూ, ఓ కులం ఓట్ల కారణంగా జనసేన గెలిచిందని మంత్రి కొడాలి నాని చెప్పడమేంటి.? అసలు జనసేన పార్టీ సున్నా చుట్టేసిందన్నది కదా ‘బులుగు నేతలు’ చేస్తున్న ప్రచారం. జనసేన నుంచి గెలిచిన అభ్యర్థుల్ని ఇతరుల కేటగిరీలోనో, బీజేపీ ప్లస్ అనో వైసీపీ పేర్కొంటోంటే, తన నియోజకవర్గంలో ఓ గ్రామాన్ని జనసేన గెలుచుకుందని మంత్రి కొడాలి నాని చెప్పడమంటే, ఎక్కడో ‘మార్పు’ గట్టిగానే మొదలైందని ఆయనకూ తెలిసొచ్చినట్టుంది.

రాష్ట్ర వ్యాప్తంగా పంచాయితీ ఎన్నికల సందర్భంగా చాలా చోట్ల జనసేన వర్సెస్ వైసీపీగా పోరు మారింది తప్ప.. టీడీపీ సోదిలో కూడా లేకుండా పోయింది. అందుకే, జనసేన పార్టీ తొలి దశ పంచాయితీ ఎన్నికల్లో 18 శాతం ఓటు బ్యాంకు సొంతం చేసుకుంటే, నాలుగో దశకు వచ్చేసరికి అది 26 శాతం దాటేసింది. ఈ అనుభావంతో మున్సిపల్, పరిషత్ ఎన్నికలకొచ్చేసరికి అధికార వైసీపీ, ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ.. ఉమ్మడిగా జనసేనను తొక్కేసే ప్రయత్నాలు మరింత ముమ్మరం చేస్తాయన్నది నిర్వివాదాంశం.

వైసీపీకి మేలు చేయడానికి మంత్రి కొడాలి నాని నియోజకవర్గంలో తమ అభ్యర్థినే నిలబెట్టని టీడీపీ.. తెరవెనుకాల వైసీపీతో ఏ స్థాయిలో అంటకాగుతోందో చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.? వైసీపీ, టీడీపీ ఒక్కటిగా పంచాయితీ ఎన్నికల్లో నిలబడినా, జనసేన తన ఉనికిని చాటుకుందంటే.. రాష్ట్రంలో రాజకీయ మార్పు మొదలైనట్లే భావించాలి. ఇంతకీ టీడీపీ – వైసీపీ మధ్య ‘ప్యాకేజీ’ ఏ స్థాయిలో నడిచి వుండొచ్చు.. పంచాయితీ ఎన్నికల సందర్బంగా.? ఇదిప్పుడు సామాన్యుడు అడుగుతోన్న ప్రశ్న.

Exit mobile version