ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

విద్యాసంస్థల కేటాయింపుల్లో తెలంగాణకు అన్యాయం: మంత్రి కేటీఆర్

తెలంగాణపై కేంద్రం వివక్ష చూపిస్తోందని కొన్నిరోజులుగా మంత్రి కేటీఆర్ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఈరోజు విద్యా వ్యవస్థపై కేంద్రం తీరును తప్పుబడుతూ ఆయన ట్వీట్ చేశారు. తెలంగాణకు కేటాయించాల్సిన విద్యా సంస్థల విషయంలో కేంద్రం వివక్ష చూపిస్తోందని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా మోదీ ప్రభుత్వం ఏడు ఐఏఎంలను మంజూరు చేసినా అందులో తెలంగాణ లేకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. మిగిలిన విద్యాసంస్థల కేటాయింపుల్లో కూడా తెలంగాణకు రిక్త హస్తం చూపారని అన్నారు.

దేశంలోని వివిధ రాష్ట్రాలకు మెడికల్ కాలేజీలు 157, నవోదయాలు 84, ఎన్ఐటీలు 4 కేటాయించినా వీటిలో తెలంగాణకు స్థానం కల్పించకపోవడం శోచనీయమని అన్నారు. కేంద్రం హామీ ఇచ్చిన గిరిజన విశ్వవిద్యాలయం కూడా కేటాయించలేదని అన్నారు. రాష్ట్రానికి వచ్చిన సంప్రదాయ వైద్య కేంద్రం గుజరాత్ లోని జామ్ నగర్ కు తరలిపోయిందని అన్నారు. ఈక్రమంలో వైద్య కేంద్రం హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తున్నట్టు గతంలో కిషన్ రెడ్డి చేసిన ట్వీట్ ను ట్యాగ్ చేశారు. మొత్తంగా తెలంగాణపై కేంద్రం వివక్ష చూపిస్తోందని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Exit mobile version