అసెంబ్లీకి వెళ్ళే రహదార్లలోనే ఎక్కడికక్కడ ‘ముంపు’ కనిపిస్తోందాయె. ‘ఇకపై రోడ్లపై వెళ్ళేటప్పుడు, మెడలో గాలి నింపిన ట్యూబ్స్ వేసుకుని వెళ్ళండి..’ అంటూ సోషల్ మీడియాలోనూ, మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ వెటకారాలు కనిపిస్తోంటే, ఇంకోపక్క అసెంబ్లీలో ‘హైద్రాబాద్ విశ్వ నగరం’ అంటూ పెద్ద పెద్ద మాటలు చెప్పేస్తున్నారు తెలంగాణ మంత్రి కేటీఆర్. జీహెచ్‌ఎంసీ చట్ట సవరణ బిల్లుని అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టిన సందర్భంగా కేటీఆర్, ‘విశ్వనగరం’ వ్యాఖ్యలు చేస్తే, ‘ఇదీ విశ్వనగరం దుస్థితి..’ అంటూ హైద్రాబాదీలు, వర్షాల కారణంగా తమ దుస్థితిని తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్టింగులు పెడుతున్నారు.
‘గత పాలకులు హైద్రాబాద్ బాగు గురించి పట్టించుకోలేదు..’ అని షరామామూలుగానే కేటీఆర్, నెపాన్ని ‘సమైక్య పాలకుల’ మీద నెట్టేశారు. కానీ, తెలంగాణలో టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చి ఆరేళ్ళయ్యింది. ఈ ఆరేళ్ళలో హైద్రాబాద్‌కి వర్షాల సమస్య ఇంకా ఇంకా పెరిగిపోతోంది తప్ప తగ్గడంలేదు. చిన్న పాటి వర్షాలకే రోడ్లు చెరువులుగా, నదులుగా మారిపోతున్న వైనం.. నాలాల్లో పిల్లలు, పెద్దలు కొట్టుకుపోతున్న వైనం.. వీటిపై ప్రభుత్వం దృష్టి పెట్టలేకపోవడం శోచనీయం.
హైద్రాబాద్‌కే తలమానికంగా ‘కేబుల్ బ్రిడ్జి’ కట్టేస్తే సరిపోతుందా.? మెట్రో రవాణా అందుబాటులోకి వస్తే సరిపోతుందా.? సామాన్యుడు రోడ్డుమీద నడవలేని దుస్థితి నెలకొందంటే, దానికి పాలకులు నైతిక బాధ్యత వహించకపోవడం శోచనీయం. హైటెక్ సిటీలో అభివృద్ధిని చూపించి, ‘ఇదే విశ్వనగరం’ అంటే, మిగతా హైద్రాబాద్ మాటేమిటి కేటీఆర్‌గారూ.!