ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

గ్రేటర్‌ పోరు.. టీఆర్‌ఎస్‌ పాలనకి రిఫరెండం కాదట.!

గ్రేటర్‌ హైద్రాబాద్‌ ఎన్నికలంటే.. మినీ అసెంబ్లీ ఎన్నికల్లాంటివే.. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. కానీ, తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు మాత్రం, ‘తూచ్‌.. ఇవి మినీ అసెంబ్లీ ఎన్నికలు కానే కావు.. రాష్ట్రంలో వున్న అనేక మునిసిపాలిటీల్లో ఇది కూడా ఒకటే.. ఇవి జస్ట్‌ కార్పొరేషన్‌ ఎన్నికలు మాత్రమే..’ అని సెలవిచ్చారు.

ఏంటీ ప్లేటు ఫిరాయింపు.? అంటే, అదంతే.! గ్రేటర్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ కొంత వ్యతిరేకతను చవిచూస్తోంది. ఆయా ప్రాంతాల్లో ప్రజా ప్రతినిథులకు ఓటర్లు చుక్కలు చూపిస్తున్నారు. దాంతో, మంత్రి కేటీఆర్‌ నాలిక మడత పడినట్లు కనిపిస్తోంది. ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా, ఈ తరహా ఎన్నికల్లో అధికార పార్టీకే అడ్వాంటేజ్‌ ఎక్కువ. అయినాగానీ, టీఆర్‌ఎస్‌ భయపడుతోంది.

అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు జనాన్ని ఎలాగైతే తరలిస్తారో.. అలాగే జీహెచ్‌ఎంసీ ఎన్నికల కోసం టీఆర్‌ఎస్‌ అనూహ్యమైన రీతిలో జనాన్ని తరలిస్తోంది. కనీ వినీ ఎరుగని రీతిలో ఈ ఎన్నికల కోసం తెరవెనుకాల ఖర్చు జరుగుతోంది. ఇంతా చేసినా, బీజేపీ నుంచి ఎదురవుతున్న పోటీ నేపథ్యంలో అధికార పార్టీ సంయమనం కోల్పోతోంది.

విపక్షాల నుంచి మాటల తూటాలు రావడం సహజమే. అధికార పార్టీ సంయమనం కోల్పోతే ఎలా.? ‘ముస్లింలపై గుడ్డి వ్యతిరేకత ఎందుకు.?’ అంటూ మంత్రి కేటీఆర్‌, బీజేపీపై విరుచుకుపడిపోయారు. ఇవే, ఇలాంటి వ్యాఖ్యలే.. ప్రత్యర్థులకు అడ్వాంటేజ్‌గా మారతాయి. ‘మీకు అంత గుడ్డి ప్రేమ ఎందుకు.?’ అన్న ప్రశ్న రాకుండా వుంటుందా టీఆర్‌ఎస్‌పైన.

చార్మినార్‌ దగ్గరున్న భాగ్యలక్ష్మి దేవాలయానికి బీజేపీ వెళితే, అదేదో దేశద్రోహమన్నట్లుగా టీఆర్‌ఎస్‌ నేతలు మాట్లాడుతుండడం హిందూ సమాజంలో కొంత అలజడికి కారణమవుతోంది. ‘భాగ్యలక్ష్మి దేవాలయం పాకిస్తాన్‌లో వుందా.?’ అన్న ప్రశ్న తెరపైకొస్తోంది మరి.

నిజానికి, కేటీఆర్‌ మంచి మాటకారి. తండ్రికి తగ్గ తనయుడు. తండ్రి కంటే కూడా ‘సయమనం’లో నాలుగాకులు ఎక్కువే చదివిన వ్యక్తి. కానీ, కేటీఆర్‌ కూడా సంయమనం కోల్పోతున్నారు. ఆ స్థాయిలో ఆయనపై ఒత్తిడి పెరుగుతోంది మరి. దుబ్బాక ఉప ఎన్నికలో తగిలిన దెబ్బ, గ్రేటర్‌ ఎన్నికల్లోనూ తగిలితే, టీఆర్‌ఎస్‌ కథ ముగిసిపోతుందేమోనన్న ఆందోళన కేటీఆర్‌ని వెంటాడుతున్నట్టుంది మరి.

Exit mobile version