సోమవారం ఆంధ్రప్రదేశ్ సహా మెజారిటీ రాష్ట్రాల్లో మద్యం అమ్మకాల్ని పునఃప్రారంభించారు. తెలంగాణలో బుధవారం అమ్మకాలు మొదలయ్యాయి. ప్రస్తుతం దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో వైన్ షాపులు నడుస్తున్నట్లే కనిపిస్తోంది. ఐతే మళ్లీ మద్యం దుకాణాలు తెరుచుకోవడంపై రాజకీయ పార్టీల వైఖరి రాష్ట్రానికి రాష్ట్రానికి మారిపోతుండటం.. దీనిపై కొంచెం కూడా ఆత్మ విమర్శ చేసుకోకుండా రాజకీయం చేస్తుండటమే ఆశ్చర్యం కలిగించే విషయం.
రాష్ట్రాలకు మద్యం అమ్ముకునేందుకు అనుమతి ఇచ్చింది భాజపా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం. కానీ ఢిల్లీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న ఆ పార్టీ.. ఆప్ సర్కారు మద్యం అమ్మకాలు తిరిగి మొదలుపెట్టడాన్ని ఆక్షేపించింది. కానీ యూపీలో ఆ పార్టీ నేతృత్వంలోని సర్కారు వైన్ షాపులు తెరిచింది. అక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై విమర్శలు చేసింది. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న పంజాబ్‌లో కూడా మద్యం దుకాణాలు మళ్లీ మొదలుపెట్టారు.
ఢిల్లీలో భాజపా నుంచి విమర్శలెదుర్కొంటున్న ఆప్.. పంజాబ్‌లో మద్యం దుకాణాలు తెరవడంపై కాంగ్రెస్ సర్కారును విమర్శించింది. కేంద్రంలో అధికారంలో ఉంటూ రాష్ట్రాలకు అనుమతులివ్వడానికి కారణమైన భాజపా.. మహారాష్ట్రలో శివసేన-కాంగ్రెస్ సర్కారు మద్యం అమ్మకాలకు అనుమతులివ్వడాన్ని తప్పుబట్టింది. ఇలా ఒక విధానం అంటూ లేకుండా రాష్ట్రానికో రకంగా రాజకీయ పార్టీలు వ్యవహరించడం విడ్డూరం.