కరోనా భయాన్ని కూడా వదిలిపెట్టి లక్షలాది మంది నల్ల జాతీయులు నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. అవి హింసాత్మకంగా మారాయి కూడా. ఆ తాకిడి వైట్ హౌస్‌ను తాకి అధ్యక్షుడు ట్రంప్ కుటుంబం బంకర్‌లోకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. వర్ణ వివక్షపై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాల సెలబ్రెటీలు స్పందిస్తున్నారు. దీనిపై రకరకాల హ్యాష్ ట్యాగ్స్ పెట్టి వివక్షను ఖండిస్తున్నారు. మన మహేష్ బాబు సైతం నిన్న ట్రెండింగ్‌లో ఉన్న #noblacktuesday హ్యాష్ ట్యాగ్‌తో ట్వీట్ వేశాడు.
ఐతే ఈ ట్వీట్ మీద నెటిజన్లు మండిపడుతున్నారు. మహేష్ బాబు మీద కౌంటర్లు వేస్తున్నారు. అతడి సినిమాల్లో రంగు ప్రాధాన్యాన్ని ఎలివేట్ చేసేలా ఉన్న సన్నివేశాల్ని బయటికి తీసి మహేష్‌ను ట్రోల్ చేస్తున్నారు. అతడు సినిమాలో త్రిషను ఉద్దేశించి పెద్ద కలర్ కూడా కాదు కదా అంటాడు మహేష్. దూకుడు మూవీలో నీ కలరేంటి నా కలరేంటి అని సమంతను కౌంటర్ చేస్తాడు. ఈ మధ్య వచ్చిన సరిలేరు నీకెవ్వరులో మియాం మియాం పిల్లి మిల్క్ బాయ్‌తో పెళ్లి అనే డైలాగ్ ఉంటుంది.
ఇంకా చాలా సినిమాల్లో మహేష్ రంగును పొగుడుతూ డైలాగులు, సీన్లు ఉంటాయి. రంగు గురించి ఇలా ఎలివేషన్లు ఇచ్చుకుని.. ఇప్పడు #noblacktuesday అని ట్వీట్ వేయడం హిపోక్రసీ అంటూ మహేష్ బాబును విమర్శిస్తున్నారు నెటిజన్లు. మహేష్ అని కాదు.. ఇంకా చాలామంది సెలబ్రెటీలు ఇలాగే ట్రోలింగ్‌కు గురవుతున్నారు. ఫెయిర్‌నెస్ క్రీమ్ యాడ్స్ చేసిన వాళ్లందరికీ ఈ సెగ తగులుతోంది.