ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

మమతకు వరుస కష్టాలు.. పార్టీ వీడుతున్న నేతలు

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కి షాకులు మీద షాకులు తగులుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడటం ఆందోళన కలిగిస్తోంది. రెండు రోజుల వ్యవధిలో ముగ్గురు ఎమ్మెల్యేలు తృణమూల్ కు గుడ్ బై చెప్పడంతో బెంగాల్ రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయి. పార్టీలో ఎప్పటినుంచో కీలకంగా ఉన్న సువేందు అధికారితోపాటు మరో ఎమ్మెల్యే జితేంద్ర తివారీ బయటకు వెళ్లిపోగా.. తాజాగా ఎమ్మెల్యే శీల్ భద్ర దత్తా సైతం పార్టీకి రాజీనామా చేశారు. ప్రజల ఓట్లతో గెలిచినందున ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంలేదని పేర్కొన్నారు.

వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చిన మమత.. హ్యాట్రిక్ కొట్టాలనే పట్టుదలతో సాగుతున్నారు. అయితే, కమలనాథుల నుంచి ఆమెకు పోటీ కనిపిస్తోంది. దీంతో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సాయం తీసుకుంటున్నారు. కానీ పలువురు నేతలు ఆయన నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో పార్టీలో అంతర్గతంగా విభేదాలు పొడసూపాయి. దీంతో ఇప్పటివరకు ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీని వీడారు.

వీరిలో సువేందు అధికారి బీజేపీలో చేరనున్నట్టు ప్రచారం జరుగుతోంది. శనివారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా బెంగాల్ రానున్నారు. అప్పుడు సువేందుతోపాలు పలువురు తృణమూల్ నేతలు కాషాయ కండువా కప్పుకునే అవకాశం ఉంది. మరోవైపు తృణమూల్ మాత్రం ఎన్నికల్లో విజయం తమదేనని ధీమాగా ఉంది. ఒకరిద్దరు రాజీనామా చేసినంత మాత్రాన తమకు వచ్చే నష్టం ఏమీ లేదని పేర్కొంది.

Exit mobile version