సమరసింహారెడ్డి, ఇంద్ర, నరసింహనాయుడు, ఖుషి, ఒక్కడు, పోకిరి లాంటి ఆల్ టైం హిట్లకు సంగీతం సమకూర్చింది ఆయనే. వాటి సక్సెస్‌లో మణిశర్మ పాత్ర కీలకం. క్లాస్, మాస్ అని తేడా లేకుండా అందరినీ అలరించే సంగీతం ఇవ్వడం మణిశర్మ ప్రత్యేకత. ఐతే మణిశర్మ ఎప్పుడూ ఔట్ డేట్ అయిపోలేదు. ఆయన ఆడియోలు ఎప్పుడూ ఫెయిలవలేదు. కానీ ఆయనకు ఆయన అవకాశాలు తగ్గిపోయాయి. ఇండస్ట్రీ నుంచి కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది.
ఈ మధ్య మళ్లీ కొంచెం పుంజుకుని తన సత్తా చాటే ప్రయత్నం చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి సినిమా ‘ఆచార్య’కు సంగీతం సమకూరుస్తున్నారు. ఐతే ఒకప్పుడు తనకు ఉన్నట్లుండి ఎందుకు అవకాశాలు తగ్గిపోయాయో.. తానేం తప్పు చేశానో ఇప్పటికీ అర్థం కాలేదంటూ ఓ ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేశారాయన. ‘‘నేను గతంలో శక్తి, తీన్‌మార్, ఖలేజా లాంటి పెద్ద సినిమాలకు సంగీతం అందించాను.
ఆ మూడు సినిమాల విషయంలో నేనేమైనా పొరబాట్లు చేశానా? ఆ సినిమాలు ఆడలేదు కానీ.. నా పాటలు పాపులర్ అయ్యాయి. ఆ మూడు చిత్రాల తర్వాత.. ఇప్పుడు ‘ఆచార్య’ చేయడానికి ముందు నాకు ఒక్క పెద్ద సినిమాలోనూ ఛాన్స్ రాలేదు. సంగీత పరంగా ఆ సినిమాల్లో నేను చేసిన తప్పేంటో నాకర్థం కాలేదు. సినిమా సక్సెస్సే ఇక్కడ అన్నిటికీ కొలమానం. అన్ని సినిమాలూ నాకే ఇవ్వాలని నేనెప్పుడూ కోరుకోలేదు. నలుగురితో నేనూ ఉండాలనుకుంటా’’ అని మణిశర్మ అన్నారు.