ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

ఆత్మకథ రాసే ప్రయత్నంలో చిరు

తెలుగు సినీ చరిత్రలో అత్యంత స్ఫూర్తిదాయక ప్రయాణం ఎవరిది అంటే మరో మాట లేకుండా మెగాస్టార్ చిరంజీవిదే అని చెప్పేయొచ్చు. చిరంజీవి కంటే ముందు ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ కూడా తిరుగులేని స్టార్ ఇమేజ్ సంపాదించారు. కానీ వాళ్లు సినిమాల్లోకి రావడానికి, నిలదొక్కుకోవడానికి పెద్దగా ప్రయాస పడలేదు. చాలా తక్కువ కాలంలోనే స్టార్ ఇమేజ్ సంపాదించారు. కానీ చిరంజీవి సంగతి అలా కాదు.

చాలా మామూలు కుటుంబం నుంచి వచ్చి.. ముందు చిన్న చిన్న పాత్రలు చేసి.. విలన్ పాత్రలూ ప్రయత్నించి.. ఆపై హీరోగా కూడా చిన్న సినిమాల్లో నటించి.. చివరికి ‘ఖైదీ’ సినిమాతో స్టార్ ఇమేజ్ సంపాదించాడు. ఆ తర్వాత హీరోగా ఎవ్వరూ చేయని విన్యాసాలు చేసి, ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించి మెగాస్టార్‌గా ఎదిగాడు. దశాబ్దాలుగా సినీ పరిశ్రమలో తన ఆధిపత్యాన్ని చాటుతూ వస్తున్నారు. పదేళ్ల విరామం తర్వాత రీఎంట్రీ ఇచ్చి కూడా తన స్థాయిని చాటుకున్న ఘతన చిరంజీవిదే.

ఇంతటి స్ఫూర్తిదాయక వ్యక్తి జీవితం ఆత్మకథగా పుస్తక రూపంలోకి వస్తే స్పందన అద్భుతంగా ఉంటుందనడంలో సందేహం లేదు. చిరు కూడా ఆ ఆలోచనలోనే ఉన్నట్లు వెల్లడైంది. ఇప్పటికే చిరు మీద ఎన్నో పుస్తకాలు వచ్చాయి కానీ.. ఆయన స్వయంగా ఆత్మకథ రాస్తే దానికి ఉండే విలువే వేరు.

తనకు ఆత్మకథ రాయాలన్న ఆలోచన చాన్నాళ్లుగానే ఉందని.. కానీ ఖాళీ దొరకలేదని.. ఐతే కరోనా వైరస్ కారణంగా అన్ని పనులూ ఆగిపోవడంతో ఇప్పుడు తీరిక దొరికిందని.. దీంతో ఆత్మకథ మీద దృష్టిసారించానని ఓ ఇంటర్వ్యూలో చిరు వెల్లడించాడు.

తన భార్య సురేఖ సహకారంతో పాత రోజుల్లోని సంఘటనలన్నీ గుర్తు చేసుకుంటూ వాటిని ఆడియో రూపంలో రికార్డు చేస్తున్నట్లు చిరు వెల్లడించాడు. కాబట్టి సమీప భవిష్యత్తులో చిరంజీవి ఆత్మకథ అభిమానుల ముందుకు వచ్చే అవకాశాలున్నట్లే. ముందు తన జీవిత విశేషాల్ని రికార్డు చేసి.. మంచి రచయితల చేతికిచ్చి ఆత్మకథను సిద్ధం చేయించబోతున్నాడన్నమాట చిరు.

Exit mobile version