‘ఆత్మ నిర్భర్ కాదు…దుర్బల్!’ శీర్షికతో బ్యానర్ స్టోరీని ఆంధ్రజ్యోతిలో కేంద్ర ప్రభుత్వ ప్యాకేజీలోని డొల్లతనాన్ని ఎండగడుతూ రాయడం ఆశ్చర్యమే. లాక్‌డౌన్ నేపథ్యంలో దేశ ప్రజల్ని ఆదుకునే పేరుతో కేంద్రం ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ వల్ల సామాన్యులకు ఒరిగేదేమీ లేదని అందరికీ తెలిసినా…కేంద్రానికి భయపడి ఏ ఒక్కరూ నోరు మెదపలేదు. మొట్ట మొదటగా పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ, ఆ తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం కేంద్ర ప్యాకేజీని తూర్పార పట్టారు.
ఈ నేపథ్యంలో ఆంధ్రజ్యోతిలో రాసిన తాజా కథనం ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబిస్తోంది. ఇతర దేశాల్లో ఇచ్చిన ప్యాకేజీలతో పోలిస్తే మన దేశంలో ఇచ్చిన 20 లక్షల కోట్ల ప్యాకేజీతో ప్రజలకు ఒరిగిందేమీ లేదని ఆర్థిక నిపుణుల అభిప్రాయాన్ని ప్రధానంగా రాసుకొచ్చారు. ఇంకా చెప్పాలంటే మార్చి 26న ప్రకటించిన రూ.1.70 లక్షల కోట్ల ప్యాకేజీతో పేదలకు అంతోఇంతో ఉపశమనం కలిగిందని ఆ కథనంలో ప్రస్తావించారు. అందుకే ఇది ఇది ‘ఆత్మ నిర్భర్’ ప్యాకేజీ కాదని.. దుర్బల (బలహీన) ప్యాకేజీ అన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయంటూ కేంద్రానికి చురకలు అంటించారు.
కేంద్రం ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల బాహుబలి ప్యాకేజీతో కేంద్రంపై పడే వాస్తవ ఆర్థిక భారం రూ.1.5 లక్షల కోట్లు మాత్రమే అని బార్‌క్లేస్ నివేదిక అంచనా అని ఈ కథనం ద్వారా కేంద్ర సర్కార్ నిజ స్వరూపాన్ని ఆవిష్కరించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతా రామన్ పలు వర్గాలకు ప్రకటించిన ప్యాకేజీలో అత్యధికం ప్రభుత్వంపై ఆర్థిక భారం మోపనివే అంటూ చురక లంటిస్తూ చర్చకు తెర లేపారు. లాక్‌డౌన్ వల్ల ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 90 దేశాలు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు నేరుగా ప్రజల ఖాతాల్లోకి నగదు వేసినట్టు ప్రపంచ బ్యాంక్ ఆర్థిక వేత్త యూగో జెంటిలిని చెప్పిన విషయాన్ని ప్రస్తావించడం ద్వారా …మన దేశంలో మాత్రం ఆ పని చేయలేదని విమర్శించినట్టైంది.
ఈ సందర్భంగా అమెరికాలో ఏడాదికి 75 వేల డాలర్ల కంటే తక్కువ ఆదాయం ఉన్న పన్ను చెల్లింపుదారులకు మన కరెన్సీలో దాదాపు రూ.91 వేలు (1200 డాలర్లు) చెల్లించే పథకాన్ని ఆ దేశ సర్కార్ అమలు చేసిందని వెల్లడించారు. ఇంకా హాంకాంగ్‌లో రూ.97 వేలు, కెనడాలో రూ.1.08 లక్షలు, బ్రిటన్‌లో ప్రైవేట్ ఉద్యోగులకు 80 శాతం వేతనాలను మూడు నెలల వరకు ప్రభుత్వమే చెల్లించినట్టు వెల్లడించారు. డెన్మార్క్‌లో కూడా ప్రైవేట్ ఉద్యోగులకు వేతనాలు ఇచ్చేందుకు ప్రభుత్వమే ఆర్థిక సహకారం అంది స్తున్నట్టు రాశారు. ఉద్యోగుల వేతనాల్లో 75 శాతం నుంచి 90 శాతం వరకు ఒక్కో ఉద్యోగికి అత్యధికంగా నెలకు రూ.3 లక్షల వరకు చెల్లించేందుకు ఓ పథకాన్ని రూపొందించారని వెల్లడించారు.
అంటే ఇలాంటి పనులేవీ మన భారత ప్రభుత్వం చేయలేదని ఈ కథనం ద్వారా ఆంధ్రజ్యోతి లేదా ఆర్‌కే నిర్భయంగా ప్రకటిం చారు. మోడీ సర్కార్ ఆత్మ నిర్భర్ అంటే ఆర్‌కే మాత్రం దుర్బల్ అని ధైర్యంగా రాసుకొచ్చారు. కేంద్రంతో ఆర్‌కేకి ఎక్కడైనా సంబంధాలు బెడిసి కొట్టాయా? లేక ఆర్‌కే తనకు తానుగా మోడీతో సత్సంబంధాలున్నట్టు ఓ సీన్ క్రియేట్ చేసి…ఇప్పుడు వర్కవుట్ కాకపోవడంతో వ్యతిరేక కథనాలు రాయడం స్టార్ట్ చేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా మోడీ సర్కార్ ప్రకటించిన ప్యాకేజీలోని డొల్లతననాన్ని బట్ట బయలు చేసిన ఆర్‌కేని అభినందించాల్సిందే.