ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

‘పార్లమెంట్‌’పై మోయలేని భారం

ప్రాణాంతకమైన కరోనా వైరస్‌ బారిన పడకుండా ఎంపీలను రక్షించడంలో భాగంగా వర్షాకాల పార్లమెంట్‌ సమావేశాలను కేంద్రం కుదించింది. కేవలం 18 సిట్టింగ్‌లకు మాత్రమే పరిమితం చేసింది. వరుస ప్రభుత్వాల ఆర్థిక అవకతవకలను ఎండగట్టడానికి, ప్రభుత్వాల పనితీరును తూర్పారబట్టడానికి, ప్రజల్లో ఎంపీల పలుకుబడిని పెంచడానికి గత 70 సంవత్సరాలుగా ఎంతో ఉపయోగపడుతూ వస్తోన్న ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో మొదటిసారిగా మార్పు చేశారు. ఇరు సభల్లోను మంత్రులను ఎంపీలు మౌఖికంగా అడిగే ప్రశ్నల విధానాన్ని రద్దు చేసి, లిఖిత పూర్వకంగా అడిగి, లిఖిత పూర్వకంగానే సమాధానాలు పొందే విధానాన్ని ప్రవేశపెట్టారు. అలాగే జీరో అవర్‌ను కూడా కుదించారు. జీరో అవర్‌ను 30 నిమిషాలకు పరిమితం చేశారు. ఇక ప్రైవేటు బిల్లులకు సమయాన్నే కేటాయించలేదు.

గత కొన్ని పార్లమెంట్‌ సమావేశాల నుంచి పెండింగ్‌లో పెడుతూ వస్తోన్న 17 బిల్లులను ఈ సమావేశాల ఆమోదానికి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. వాటిలో ఆరు బిల్లులను మాత్రమే పార్లమెంటరీ కమిటీలు స్క్రూటినీ చేశాయి. స్క్రూటిని చేయని ఆ 11 బిల్లులను ఈ పార్లమెంట్‌ సమావేశాల్లో ఎలా ఆమోదిస్తారో ! ప్రభుత్వ పెద్దలకే తెలియాలి. ఈ పరిస్థితి ఇలా ఉంటే ఈ సమావేశాల్లో కొత్తగా మరో 23 బిల్లుల ఆమోదానికి కేంద్రం ప్రతిపాదించింది. వాటిలో 11 బిల్లులు ఆర్డినెన్స్‌లకు సంబంధించినవే ఉన్నాయి. పార్లమెంట్‌ సమావేశాలు లేనప్పుడు అవసరమైన చట్టాలను ఈ ఆర్డినెన్స్‌ల ద్వారా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆ ఆర్డినెన్స్‌లకు సంబంధించిన బిల్లులను ఆరు నెలల్లోగా పార్లమెంట్‌ ఆమోదించక పోయినట్లయితే ఆ ఆర్డినెన్స్‌లు రద్దువుతాయి.

వీటితోపాటు పలు అనుబంధ పద్దులను పార్లమెంట్‌ ఆమోదించాల్సి ఉంది. ప్రాణాంతక కరోనా వైరస్‌ విజృంభణ కారణంగానైతేనేమీ, దేశ ఆర్థిక పరిస్థితి దెబ్బతీన్న నేపథ్యంలోనేమైతేనేమీ బడ్జెట్‌ ప్రతిపాదనల్లో లేని విధంగా ఆర్థిక వనరులను ఖర్చు పెట్టడం వల్ల ఈ పద్ధులను పార్లమెంట్‌ ఆమోదించాల్సి అవసరం ఏర్పడింది. పార్లమెంట్‌ సమావేశాల్లో కీలక పాత్ర పోషించాల్సిన హోం మంత్రి అమిత్‌ షా గత ఆరు వారాల్లో మూడు సార్లు ఆస్పత్రి పాలయ్యారు. క్రితం సారి సెప్టెంబర్‌ 12వ తేదీన ఆస్పత్రి పాలయ్యారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ స్పష్టత ఇవ్వకపోవడంతో ఆయన కోలుకొని ఎప్పటి నుంచి పార్లమెంట్‌ సమావేశాలకు హాజరుకాగలరో ఎవరికి అంతు చిక్కడం లేదు.

పార్లమెంట్‌ సమావేశాలపై ఇప్పటికే మోయలేని భారం ఉండగా, కోవిడ్‌ నివారణకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటోన్న చర్యలు, దేశ జీడీపీ వృద్ధి రేటు మైనస్‌ 23.9 శాతానికి పడి పోవడం, సరిహద్దుల్లో యుద్ధానికి కాలు దువ్వుతున్న చైనాను కట్టడికి చర్యలేమిటీ? తదితర అంశాలపై కేంద్రాన్ని నిలదీయాలనుకుంటోన్న ప్రతిపక్షానికి సభా సమయం ఇంకెక్కడి?!

Exit mobile version