సినీ నటుడు మోహన్ బాబు సినిమాలతోపాటు రాజకీయాల్లోనూ యాక్టివ్ గా ఉంటారన్న విషయం తెలిసిందే. కళాకారుల గురించి ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. తాజాగా ప్రధాని నరేంద్రమోడీపై ప్రశంసలు కురిపించారు. బీజేపీ జాతీయ సంస్కృతి మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సభలో ప్రధాని మోడీకి మోహన్ బాబు జైకొట్టడం విశేషం.
బీజేపీ జాతీయ సంస్కృతిక మహోత్సవం సభలో సినీ నటుడు మోహన్ బాబు మాట్లాడారు. ఎందరో కళాకారులు తిండి ఇళ్లు లేక కష్టాలు పడుతున్నారన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో కళాకారులను ఆదుకుంటున్నారో లేదో అవంతి శ్రీనివాస్ కు తెలుసు అన్నారు. తెలంగాణలోనూ జానపద కళాకారులు కష్టాలు పడుతున్నారని మోహన్ బాబు అన్నారు.
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కళాకారులను ఆదుకునే బాధ్యత తీసుకోవాలని మోహన్ బాబు కోరారు. నృత్య జానపద కళాకారులను ఆదుకోవడం ఏపీ తెలంగాణ నుంచే ప్రారంభించాలని అన్నారు. కేంద్రమంత్రిగా కిషన్ రెడ్డి ఉండడం వల్లే తెలుగు రాష్ట్రాల్లో ఈ ఉత్సవాలు జరుగుతున్నాయన్నారు.
1998లో నేను ఏపీలో బీజేపీకి ప్రచారం చేస్తే 18శాతం ఓట్లు వచ్చాయని.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి ఉన్నత పదవులు రావాలని మోహన్ బాబు ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ పై తనకు గౌరవం ఉందని మోహన్ బాబు తెలిపారు.