చెప్పే మాటలకూ, చేసే చేతలకీ అస్సలు పొంతన లేకపోవడమంటే, అందుకు కేరాఫ్ అడ్రస్ మోహన్‌బాబు.. అని చెప్పుకోవాల్సి వస్తోందిప్పుడు.. అన్నది సినీ పరిశ్రమలో బలంగా వినిపిస్తోన్న మాట. ‘చిరంజీవి నాకు మంచి స్నేహితుడు..’ అని పదే పదే చెప్పే మోహన్‌బాబు, తన కుమారుడు మంచు విష్ణు.. ‘మా’ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన కార్యక్రమానికి చిరంజీవిని ఆహ్వానించలేకపోయారు.
‘మేమంతా సినీ కళామతల్లి బిడ్డలం..’ అని ఓ వైపు చెబుతూనే, ఇంకో వైపు.. పరిశ్రమను రెండు వర్గాలుగా విభజించి, ఓ వర్గానికి ‘నాయకత్వం’ వహించేందుకోసం సర్వశక్తులూ ఒడ్డుతున్నారు మోహన్‌బాబు. నాయకత్వం అంటే ఏంటి.? నాయకుడన్నవాడు, తనను నమ్మకున్నవారికోసం నిలబడాలి. వారికి కష్టమొస్తే ఆదుకోవాలి. చిత్రంగా, నాయకుడ్ని, ప్రజలకు అప్పగించి.. ‘వాడి బాధ్యత మీదే..’ అని చెప్పడం మోహన్‌బాబుకే చెల్లింది.
అవును మరి, ‘మా’ ఎన్నికల్లో మంచు విష్ణు అధ్యక్షుడిగా గెలిస్తే, సభ్యుల్ని ఉద్దేశించి ప్రసంగించిన సమయంలో మోహన్‌బాబు వ్యాఖ్యానిస్తూ, ‘మీకు నా బిడ్డను అప్పగిస్తున్నా.. బాగా చూసుకోండి..’ అంటూ మోహన్‌బాబు చెప్పడంతో ‘మా’ సభ్యులంతా ఆశ్చర్యపోయారు.
ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి గెలిచినవారు రాజీనామా చేశారు.. ప్రకాష్ రాజ్, నాగబాబు తమ సభ్యత్వాలకే రాజీనామా చేసేశారు. మరి, మోహన్‌బాబు బాధ్యత తీసుకుని, వాళ్ళతో మాట్లాడాలి కదా.? ఇదేం పెద్దరికం.? పైగా, ‘ముక్కుసూటిగా మాట్లాడతాను.. నాకు ఎవరి మీదా రాగద్వేషాలు లేవు..’ అని చెప్పడం.
ఇందుకే, ఈ వైఖరి కారణంగానే.. మంచు విష్ణు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సినీ పెద్దలెవరూ హాజరు కాలేదన్న చర్చ సినీ పరిశ్రమలో గట్టిగా వినిపిస్తోంది. క్రమశిక్షణ.. అని పదే పదే చెప్పుకునే మోహన్‌బాబు, సాటి నటుడ్ని ప్రాంతం పేరుతో.. పరిశ్రమకు దూరం పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు తన కుమారుడ్ని, తన కుమారుడి వెంట వుండి ప్రకాష్ రాజ్ మీద విమర్శలు చేస్తున్నవారిని వారించలేకపోవడమేంటి.?