ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

ఇచ్చట ఉచిత సలహాలు లభించును

ప్రధాని మోడీ పేజీని లైక్ కొట్టినా, ఆయన ట్విట్టర్ అకౌంట్ ని ఫాలో అయినా.. ఆయనతో తమకు స్నేహం కుదిరిపోయిందని అనుకుంటారంతా. ఏకంగా వారికే సలహాలివ్వడం మొదలుపెడతారు. ప్రస్తుతం మెగా బ్రదర్ నాగబాబు కూడా ఇలానే సోషల్ మీడియా రాజకీయ సలహాదారుగా మారిపోయారు. నిన్నమొన్నటి వరకూ విమర్శలకే పరిమితం అయిన ఆయన ట్విట్టర్ అకౌంట్ లో ఇప్పుడు పూర్తిగా సలహాల ఎపిసోడ్ లు కనిపిస్తున్నాయి.

రెండోసారి లాక్ డౌన్ వద్దంటూ రీసెంట్ గా తెలంగాణ సర్కారుకి ఓ సందేశాన్ని పంపారు మెగా బ్రదర్. ఆల్టర్నేట్ ఆలోచించండి అంటూ నసిగాడు కానీ, అదేంటో చెప్పలేదు. అలా చెప్పలేనప్పుడు లాక్ డౌన్ వద్దు అనే సలహా ఇవ్వడం ఎందుకో ఆయనకే తెలియాలి. ఇప్పుడు డైరెక్ట్ గా పెదరాయుడు మోడీకే సలహాలు స్టార్ట్ చేశారు. చైనా యాప్స్ నిషేధంపై మెగా బ్రదర్ పెదవి విరిచారు.

ప్రపంచమంతా గ్లోబల్ విలేజ్ గా మారిపోయిన ఈ దశలో.. చైనా యాప్స్ బ్యాన్ చేస్తే కలిగే లాభం కంటే నష్టం ఎక్కువగా ఉండొచ్చని అన్నారు నాగబాబు. మన దేశానికి సంబంధించిన మరో విషయాన్ని చైనా బ్యాన్ చేస్తే అప్పుడేం చేస్తారనే ప్రశ్న సంధించారు. అందువల్ల బ్యాన్ చేయడం కాకుండా ఇంకేదైనా స్ట్రాటజీ ఆలోచించాలని బీజేపీ సర్కారుకి ఓ ఉచిత సలహా పడేశారు.

ఈ సలహాపై ఆల్రడీ నెటిజన్లు మండిపడుతున్నారు. యుద్ధమంటూ వచ్చిన తర్వాత, సైనికుల ప్రాణాలు పోతున్న సందర్భంలో ఇంకా లాభనష్టాలు బేరీజు వేయడం సరికాదని నాగబాబుని ట్రోల్ చేస్తున్నారు. కనీసం కల్నల్ సంతోష్ బాబు బలిదానంపై ఒక్క ట్వీట్ కూడా వేయని నాగబాబుకి.. ఇప్పుడు చైనా యాప్స్ నిషేధిస్తే ఎందుకు బాధ కలుగుతోందని నిలదీశారు.

విచిత్రం ఏంటంటే.. ఇదే నాగబాబు.. సరిగ్గా నెలరోజుల క్రితం చైనా ఫోన్లు వద్దు, చైనా యాప్స్ వద్దు, బ్యాన్ చైనా ఐటమ్స్ అంటూ సుదీర్ఘంగా ఓ ట్వీట్ వేశారు. అప్పుడు నాగబాబులో ఉప్పొంగిన దేశభక్తి ఇప్పుడేమైనట్టు. అప్పుడు చైనా యాప్స్ ని బహిష్కరించండి అని పిలుపునిచ్చిన మెగా బ్రదర్, ఇప్పుడెందుకు కేంద్ర ప్రభుత్వాన్ని పునరాలోచించుకోమంటున్నారని అంటున్నారు నెటిజన్లు.

చెప్పేవాడికి వినేవాడు లోకువైనట్టు.. మోడీకే కాదు.. అవకాశం వస్తే అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కి కూడా ఓ సలహా పారేస్తారు మన నాగబాబు. అంతే కానీ జనసేనలో ఏం జరుగుతోందో మాత్రం పట్టించుకోరు. పట్టించుకున్నా పైకి చెప్పరు. జనసేనలో నాగబాబు పాత్ర ఏంటో.. పవన్ కల్యాణ్ ఆల్రెడీ క్లారిటీ ఇచ్చేసిన తర్వాత ఈ ఉచిత సలహాలు మరీ ఎక్కువైపోయాయి.

Exit mobile version